తెలంగాణలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమయిందని.. వచ్చే నాలుగు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య శాఖ ఉన్నతాధికారులు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. అధికారుల ప్రకటనతో… ప్రజలతో పాటు… ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కూడా ఉలిక్కి పడ్డారు. రోజుకు పది, ఇరవై వేల పాజిటివ్ కేసులు నమోదయిన ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి చోట్లనే.. సామాజిక వ్యాప్తి లేదని… కేంద్రంతో పాటు.. అధికారులు చెబుతూ వస్తున్నారు. అలాంటిది… రోజుకు పదిహేను వందల కేసుల రేంజ్లో ఉన్న తెలంగాణలో సామాజిక వ్యాప్తి ప్రారంభమయిందని.., స్వయంగా… వైరస్ పై యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులే చెప్పడంతో.. ఆందోళన పెరగకుండా ఎలా ఉంటుంది.
ప్రజల్లో ఆందోళన ఎప్పుడూ ఉంది. కానీ.. అనూహ్యంగా ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కి కూడా.. అధికారుల ప్రకటనపై కోపం వచ్చింది. తెలంగాణలో సామాజిక వ్యాప్తి ప్రారంభమయిందని ఎలా చెబుతారని… అధికారులపై మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని.. తెలంగాణలోనూ.., పెరుగుతున్నాయని అంత మాత్రాన.. తెలంగాణలో సామాజిక వ్యాప్తి జరుగుతోందని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. అధికారులు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఈటల రాజేందర్ స్పందన ఉండటంతో.. ప్రభుత్వానికి..అధికారుల మధ్య సమన్వయ లోపం.. స్పష్టంగా ఉందనే విషయం బయటపడుతోందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.
ఈటల రాజేందర్ ఆరోగ్య మంత్రిగా .. కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైనప్పటి నుండి అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. మొదట్లో.. కరోనా కట్టడికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రశంసలు దక్కినప్పటికీ.. తర్వాత పూర్తిగా కాడి దించేసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు హైకోర్టు చీవాట్లు పెడుతోంది. మరో వైపు.. వైద్య సౌకర్యాలు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. టెస్టులు తక్కువ చేస్తున్నారని.. మరణాలు తక్కువ చూపిస్తున్నారని.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఈటలకు… అధికారుల మాటలు మరింత చిరాకు తెప్పిస్తున్నాయి.