ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగాన్ని సంస్కరించాలనుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మరో వినూత్న ఆలోచన చేశారు. ఇప్పటి వరకూ.. ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచే క్లాసులు ప్రారంభమవుతాయి. ఎల్కేజీ, యూకేజీ విద్య… ప్రైవేటుగానే తల్లిదండ్రులు చదివించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ ప్రీ ప్రైమరీ విద్యను కూడా ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. నిజానికి ఇప్పటికే పిల్లలను చూసుకునేందుకు… స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటినే ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 మున్సిపాలిటీల పరిధిలో 3,500 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రి-ప్రైమరీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న మూడు అంగన్వాడీ కేంద్రాలను ఏకీకృతం చేసి ఒక్క ప్రిస్కూల్గా మారుస్తారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రీ స్కూల్ ను ప్రభుత్వాలు నిర్వహించడం లేదు. ఇంగ్లిష్ మీడియంలోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా కొత్తగా అడుగులు వేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంను మత్రమే ఉంచాలని నిర్ణయించుకున్న ఆయన.. పిల్లలకు పునాదుల స్థాయి నుంచి ఇంగ్లిష్ నేర్పనున్నారు. దానికి ప్రీ స్కూల్ విధానాన్ని ఉపయోగించుకోనున్నారు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చేందుకు… జగన్మోహన్ రెడ్డి నాడు-నేడు అనే కార్యక్రమాన్ని చేపట్టి స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు.. విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. ప్రీ స్కూల్ విధానం సక్సెస్ అయితే.. ప్రైవేటు వైపు చూసే విద్యార్థుల తల్లిదండ్రుల శాతం తగ్గుతుంది. ప్రభుత్వ చదువులకు మళ్లీ మంచి రోజులు వస్తున్నట్లు అవుతుంది.