జ్యోతిక నటించిన తమిళ చిత్రం `36 వయదిలిలే`. తమిళంలో ఎప్పుడో విడుదలైంది. ఇప్పుడు దీన్ని తెలుగులో ’36 వయసులో’ పేరుతో డబ్ చేశారు. ‘ఆహా’లో స్ట్రీమింగ్కి పెట్టారు. జ్యోతిక సినిమా.. సూర్య నిర్మాత. పైగా తమిళంలో పలు అవార్డులు అందుకున్న సినిమా. కాబట్టి – కాస్త ఆసక్తి కలగడం ఖాయం. మరి ఈ సినిమా ఎలా ఉంది? 36 ఏళ్ల వయసున్న జ్యోతిక ఏం చేసింది? మహిళలకు ఎలాంటి సందేశాన్ని అందించింది?
కథ
వసంతి (జ్యోతిక) రెవిన్యూ ఆఫీసులో ఉద్యోగి. వయసు 36 ఏళ్లు. సాధారణమైన గృహిణి. ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలాంటి ఆధునిక పోకడలేం అర్థం కావు. ఇల్లు – పిల్లలు – ఉద్యోగం.. అదే జీవితం. వయసైపోతోందన్న బెంగ, భయం. ఓసారి అనుకోకుండా దేశ రాష్ట్రపతిని కలుసుకునే అవకాశం వస్తుంది. కానీ ఆయన్ని కలుసుకునే సమయంలో.. కళ్లు తిరిగి పడిపోతుంది. గొప్ప అవకాశాన్ని కాలదన్నుకున్న వసంతిపై సోషల్ మీడియాలో ట్రోలింగులు మొదలవుతాయి. భర్త (రెహమాన్) కూతురు మృదుల సైతం వసంతిని చిన్నచూపు చూస్తారు. దానికి తోడు ఆఫీసులో అవమానాలు మొదలవుతాయి. వీటన్నింటినీ తట్టుకుని వసంతి ఎలా నిలబడింది? తనని తాను ఎలా నిరూపించుకుంది? అనేదే కథ.
విశ్లేషణ
అమ్మాయి వేరు. అమ్మ వేరు. అమ్మాయిగా ఉన్నప్పుడు కనిపించే తెగువ, ధైర్యం… బహుశా అమ్మ అయ్యాక కనుమరుగైపోతాయేమో. చుట్టూ ఎన్నో బాధ్యతలు, భయాలు. వాటిమధ్య అవన్నీ మరుగున పడిపోతాయేమో..? జీవితం ఇంతే అని సర్దుకుని.. అందులోనే ఇరుక్కుపోతుంటారు భార్యలు. అందుకే వాళ్లకన్ని అనుమానాలు. వసంతిని చూస్తుంటే.. దేశంలోని 80 శాతం గృహిణులే కళ్ల ముందు కదులుతుంటారు. భర్త, పిల్లలు, సంసారం అంటూ తమ ఉనికిని కోల్పోతున్న స్త్రీలే గుర్తొస్తారు. అలాంటి పాత్ర చుట్టూ ఓ కథ అల్లుకోవడం.. దాన్ని రెండు గంటల పాటు ఆసక్తిగా చెప్పడం తప్పకుండా ఆకట్టుకుంటుంది.
ఓ అమ్మాయిల ఆశలకు, కలలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అనే ప్రశ్న నుంచి ఈ కథ పుట్టుకొచ్చింది. రాష్ట్రపతిని కదిలించే ప్రశ్న కూడా ఇదే. దానికి సమాధానం కూడా ఈ కథలోనే చెప్పే ప్రయత్నం చేశారు.
కథని చాలా సింపుల్ గా మొదలెట్టాడు దర్శకుడు. యాక్సిడెంట్ ఎపిసోడ్ చూస్తే – కథ క్రైమ్ జోనర్ లోకి వెళ్తుందేమో అనిపిస్తుంది. ఆ తరవాత… రాష్ట్రపతి ఎపిసోడ్ వస్తుంది. దాన్నీ సగంలోనే ఆపేశాడు దర్శకుడు. అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. సేంద్రియ వ్యవసాయం ప్రధానంగా రెండో సగం నడుస్తుంది. సేంద్రియ వ్యవసాయం అంటే మనకు ఈమధ్య విడుదలైన కొన్ని తెలుగు సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఈ కథ 2015లోనిదే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ చిత్రంలో భావోద్వేగ భరితమైన సన్నివేశాలకు కొదవ లేదు. వాటిని ఆవిష్కరించిన విధానమూ బాగుంది. `నీ కలే నీ సంతకం` అని చెప్పే ప్రయత్నం చేశారిందులో. ఆ కల.. ఓ గృహిణిది అయితే.. అనేదే ఈ సినిమా.
నటీనటులు
జ్యోతిక సినిమా ఇది. సినిమా అంతా తానే కనిపిస్తుంది. తన అనుభవం మహబాగా రంగరించింది. ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. అమాయకత్వం, అమ్మదనం, జెలసీ, వయసు మీద పడుతున్న భయం… ఇలా ఎన్నో కనిపిస్తాయి. తనని సమాజం ఏమంటున్నా పట్టించుకోని ఓ గృహిణి.. భర్త పిల్లలు తనని కించపరిస్తే ఎంత గిలగిలలాడిపోతుందో.. తన నటనతో చూపించగలిగింది. రెహమాన్ ఓ మధ్యతరగతి భర్తగా తన పాత్రలో ఒదగిపోయాడు.
సాంకేతిక వర్గం
ఓ గృహిణి కోణం నుంచి రాసుకున్న కథ ఇది. వాళ్లందరికీ వకాల్తా పుచ్చుకుని కథని నడిపారు. తప్పకుండా అమ్మాయిలు తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. కమర్షియల్ హంగులేం ఉండవు. పెద్ద పెద్ద ట్విస్టులు కనిపించవు. ఓ నవల చదువుతున్న ఫీలింగ్. వీలైనంత ట్రిమ్ చేసే.. సినిమాని వదిలారు. కాబట్టి… కాలక్షేపం కోసం చూసేయొచ్చు. పాటలు తక్కువే. నేపధ్య సంగీతం ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడక్కడ సంభాషణలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మహిళలు, వాళ్ల కలల గురించి చెప్పే సందర్భాలలో మాటలు నచ్చుతాయి.
ఫినిషింగ్ టచ్: మీ కలే.. మీ సంతకం