ఉదయ్ కిరణ్ బయోపిక్… ఇదెప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు నుంచీ… ఈ టాపిక్ వస్తూనే వుంది. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అప్పట్లో చెప్పుకున్నారు. ఆ తరవాత వి.ఎన్.ఆదిత్య పేరు వినిపించింది. ఇద్దరూ ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఉదయ్ కిరణ్ బయోపిక్ పనులు మొదలెట్టేసినట్టు టాక్.
వర్మకి మెగా కుటుంబం అంటే.. ఎందుకో మంట. అందరితోనూ ఆడుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా తీశాడు. రేపే జనం మీదకు వదులుతున్నాడు. ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ పై పడ్డాడు.చిరుకుటుంబ ఆధిపత్య ధోరణి వల్లే ఉదయ్ కిరణ్ కి అవకాశాలు రాకుండా పోయాయని, బంధుప్రీతి వల్ల ఉదయ్‌కిరణ్ జీవితం సర్వనాశనం అయ్యిందని ఓ వర్గం చెబుతూ ఉంటుంది. దాన్నే ఇప్పుడు వర్మ హైలెట్ చేసి సినిమాగా చూపించబోతున్నాడట. ఏటీటీ వేదిక చేతిలో ఉంది. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయగల టెక్నిక్ వుంది. ఎలాంటి సినిమా తీసినా వివాదం చేసి, క్యాష్ చేసే తెలివితేటలున్నాయి. ఇంకేం కావాలి? అందుకే.. వర్మ తదుపరి ప్రాజెక్టు ఇదే కావొచ్చని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.