పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏం చేయాలన్నదానిపై గవర్నర్.. బిశ్వభూషణ్ హరిచందన్… న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొదటగా ప్రభుత్వం వద్ద నుంచి ఆ బిల్లులు వచ్చిన తర్వాత గవర్నర్.. ప్రభుత్వ న్యాయవిభాగానికే పంపారు. న్యాయపరంగా కరెక్టేనా కాదా.. చెప్పాలని కోరారు. న్యాయవిభాగం.. వాటినీ సీఎంవోకు పంపింది. సీఎంవో నుంచి అంతా కరెక్టేనని చెబుతూ.. మళ్లీ గవర్నర్ వద్దకు వచ్చాయి. అయితే.. గవర్నర్ మాత్రం.. ఆ బిల్లుల విషయంలో వస్తున్న ఫిర్యాదులు.. విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయనే అభిప్రాయాలు.. అలాగే… ఇప్పటికే సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులు అనే సమాచారం కారణంగా… ఇతర రాజ్యాంగ నిపుణులు.. న్యాయ కోవిదుల్ని సంప్రదిస్తున్నారు. రెండు రోజుల నుంచి గవర్నర్ ఈ బిల్లులపై నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
మామూలుగా అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ … ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులు వచ్చినట్లుగా సంతకం చేసి పంపేవారు. ఎప్పుడైనా ఒక్క రోజు ఆగితే… ప్రభుత్వం తరపున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినో.. మరో కీలక నేతనో.. వెళ్లి.. పని పూర్తి చేసుకుని వచ్చేవారు. అయితే.. అలా తీసుకొచ్చిన బిల్లులు న్యాయ సమీక్షలో నిలబడటం లేదు. పైగా… గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లులను ఎలా ఆమోదిస్తారన్న అభిప్రాయాలు న్యాయస్థానాల నుంచి కూడా వచ్చాయి. దీంతో.. వివాదాస్పద బిల్లుల విషయంలో ఒకటికి రెండు సార్లు నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాలని.. నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో… ప్రధాని కార్యాలయం కూడా.. ఆ బిల్లులపై ఆరా తీసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
రెండు రోజుల్లో అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. బిల్లులపై నిర్ణయం తీసుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర చట్టంతో ముడి పడి ఉందని వస్తున్న అభిప్రాయ నేపధ్యంలో గవర్నర్ వాటిని .. రాష్ట్రపతికి పంపవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ న్యాయనిపుణులు.. రాజ్యాంగ నిపుణుల నుంచి అంతా.. చట్టబద్ధంగానే బిల్లులు ఉన్నాయన్న అభిప్రాయం వస్తే మాత్రం.. రెండు రోజుల్లో… సంతకం పెట్టేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మూడు రాజధానులు ఉనికిలోకి వస్తాయి.