ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ రేటు… ఒకప్పుడు.. ఒకటి, రెండు శాతమే ఉండేది. ఇప్పుడు అది పదహారు శాతానికి పెరిగింది. అంటే.. ప్రతి వంద మందిలో పదహారు మందికి వైరస్ నిర్ధారణ అవుతోంది. ఇది చాలా ఆసాధారణం. సామాజిక వ్యాప్తి ప్రారంభమయిందనడానికి సంకేతం అని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా.. పల్లెల్లోనే వైరస్ విస్తరిస్తోంది. మామూలుగా అయితే.. పట్టణాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడ జీవన విధానం వల్ల .. ఒకరి నుంచి ఒకరికి శరవేగంగా విస్తరిస్తుందని.. అంచనా ఉంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. అత్యధికం మెట్రో నగరాల్లోనే. పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేసులు మరీ ఎక్కువగా నమోదవడం లేదు. కానీ ఏపీలో మాత్రం.. పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట్లనే కేసులు నమోదవుతున్నాయి.
గోదావరి జిల్లాల్లో వైరస్ విలయ తాండవం చేస్తోంది. శ్రీకాకుళం లాంటి చోట్ల కూడా… అంతకంతకూ పాకిపోతోంది. ప్రభుత్వ వర్గాలు కూడా.. ఈ పాజిటివ్ కేసుల విజృంభణపై ఆందోళన చెందుతున్నాయి. ఏ విధంగా చూసినా… ఇంత పెద్ద స్థాయిలో కేసులు నమోదవడం.. భవిష్యత్‌లో అందరికీ సోకవచ్చని.. చెప్పినంత తేలికగా తీసుకునే పరిస్థితి లేదంటున్నారు. పైగా.. జరుగుతున్న ప్రచారంతో కరోనా సోకిన రోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. భయం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారు ఉంటున్నారు. వారిలో ధైర్యం కల్పించే చర్యలనూ తీసుకోలేకపోతున్నారు.
మరో వైపు ప్రభుత్వం వైద్య సదుపాయాలు.. పెంచుతున్నామనే ప్రకటనలు .. ఎప్పటికప్పుడు చేస్తోంది కానీ.. ఎక్కడా పెరిగిన సూచనలే కనిపించడం లేదు. కోవిడ్ బాధితుల కోసం రోజుకు ఆరున్నర కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం లెక్క చెబుతోంది. కానీ… క్వారంటైన్ సెంటర్లలో మాత్రం.. రోగులు అవస్థలు పడుతున్నారు. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో చెట్ల కిందటే.. ప్రాణాలు పోతున్నాయి. ఏపీలో ఉన్న వైద్య సౌకర్యాలకు మించి ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. ఈ రేంజ్‌లోనే కేసులు పెరుగుతూ పోతే… వైద్య పరంగా.. ఏపీ డిజాస్టర్‌ను చూస్తుందన్న ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది.