నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సంఘటనలు, వాటికి ఈ దేశానికి ఏదో ఒకరోజు తాను ప్రధాని కాగలనని కలలు కంటూ ఉన్న ఒక అసమర్థ నాయకుడు ఇస్తున్న మద్దతు అన్నీ కలిపి చీదరింపు పుట్టిస్తున్నాయి. రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి అయినా దిగజారగలదు అనే విషయంలో ఈ దేశ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. కాంగ్రెస్ నాయకులు ఎన్ని చవకబారు వేషాలు వేసినా.. ఈ దేశ ప్రజలు వారిని సానుభూతితో అర్థం చేసుకోగలరు! కాంగ్రెస్ పార్టీ తీరే అంత అని సరిపెట్టుకోగలరు! కానీ.. ఈ దేశాన్నే పణంగా పెట్టేసే పోకడలు పోతే ఎలా? రేప్పొద్దున్న కాంగ్రెస్ వందిమాగధులంతా చేసే భజనలు, అమ్మస్తోత్రాలు ఫలించి.. రాహుల్ ప్రధాని అయ్యే రోజు గనుక దాపురిస్తే.. ఆయన ఏ దేశాన్ని ఏలుకుంటారు?
రాహుల్ తెలిసి చేస్తున్నారో అజ్ఞానం కొద్దీ చేస్తున్నారో అర్థం కావడం లేదు గానీ.. హక్కుల పేరిట, ఈ దేశపు లౌకిక ప్రజాస్వామ్యంలో ఉన్న రాజ్యాంగబద్ధమైన రక్షణ పేరిట ఉగ్రవాదానికి దేశప్రజల్ని తొత్తులుగా తీర్చిదిద్దడానికి, దేశనాశనానికి కంకణం కట్టుకున్న ఉగ్రవాదులకు ఈ దేశంలోనే ఇబ్బడి ముబ్బడిగా నైతిక మద్దతు లభించడానికి.. తద్వారా.. ఈదేశంలో దేశవినాశనానికి మెజారిటీ మద్దతు లభిస్తున్నదనే భావనను వ్యాపింపజేయడానికి తన వంతు కృషిచేస్తున్నారని చెప్పాలి.
అఫ్జల్‌గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ జెఎన్యూలో జరిగిన సభలో దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు విద్యార్థి నాయకుడు కన్హయా కుమార్‌ను అరెస్టు చేసి కేసులు పెట్టారు. ప్రభుత్వం అంటూ ఉన్న తరువాత.. అలాంటి సంఘటన నేపథ్యంలో కనీసం కేసులు కూడా పెట్టకుండా ఏం చేయాలి? చేతులు ముడుచుకుని.. మీ ఇష్టం వచ్చినట్లుగా దేశాన్ని తగలెట్టేస్తాం అంటూ ప్రతిజ్ఞలు చేస్తూ కూర్చోండి.. మేం ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉంటాం.. అని చెప్పాలా?
అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయని, ప్రభుత్వం కేసులు పెడుతున్నదని.. రాహుల్ అంటున్నారు. ఈ దేశంలో ఏ మూలన ఒక కార్చిచ్చు రగులుతుందా.. ఆ మంటలను మరికాస్త ఎగదోసి చలి కాచుకుందామా.. అని గోతికాడ నక్కలాగా కాచుకుని కూర్చుని ఉన్న రాహుల్ నుంచి అంతకంటె తెలివైన వ్యాఖ్యలను ఆశించలేము.
ఈ దేశంలో ప్రజలకు అన్ని హక్కులు ఉన్నాయి. తమ అభిప్రాయాలు తెలియజేయడానికి, స్వేచ్ఛగా వర్తిల్లడానికి సర్వాధికారాలు ఉన్నాయి. కానీ దానికి హద్దులు కూడా ఉంటాయని ‘నేనొక దేశ ప్రధానిని’ అంటూ కలలు కంటూ ఉండే ఈ వ్యక్తికి ఎందుకు తెలియదు. ఈ దేశంలో కసబ్‌ను ఉరితీసిన సందర్భంలోనూ దేశవ్యాప్తంగా ఎన్నో వేల మంది ఆ ఉరితీతను వ్యతిరేకించారు. చాలా అక్రమం అంటూ నిరసించారు. అలాగని వారంతా కసబ్ పాల్పడిన హత్యాకాండను సమర్థిస్తున్న వారు కాదు. కానీ కసబ్‌ను ఉరితీయడాన్ని మాత్రం వ్యతిరేకించారు. అలాంటి వారిలో ఒక్కరి మీద కూడా దేశద్రోహం కేసులు నమోదు కాలేదే? తమ అభిప్రాయాలు, నిరసనలు, భావాలు వ్యక్తం చేయడంలో హద్దు దాటకుండా ఉండినందుకు ఫలితం అది.
కన్హయా కుమార్ ‘మనమంతా పాకిస్తాన్ జిందాబాద్’, ‘అఫ్జల్ గురు జిందాబాద్’ అనాలంటూ విద్యార్థుల్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోంటే ప్రభుత్వాలు కేవలం అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు మాత్రం చూసుకుంటూ వెళ్లిపోవాలా? రాహుల్‌గాంధీ అక్కడకు వెళ్లి అఫ్జల్‌గురు అనుకూల విద్యార్థి సంఘాల వారినందరినీ మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండడం చీదర పుట్టిస్తున్నది. ఈ దేశంలో హక్కుల్లేవా, ప్రజాస్వామ్యం లేదా? మీరు దేశద్రోహులు కాదు.. మీ గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్న వాళ్లే దేశద్రోహులు అంటూ రాహుల్‌గాంధీ ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తన మాటలు విద్యార్థుల్ని సమర్థిస్తున్నాయని ఆయన అనుకుంటున్నారేమో! నిజానికి అఫ్జల్ గురు నే సమర్థించేలా అవి రంగు పులుముకుంటున్నాయనుకునేంత జ్ఞానం ఆయనకు ఉండకపోవచ్చు. ఆ అభిప్రాయమే ప్రభుత్వానికి కలిగితే అప్పుడిక దేశద్రోహం కేసు ఎవరిమీద పెట్టాలి?
దేశానికి ప్రమాదకరంగా మారుతున్న పరిణామాల విషయంలో తాను వేలు పెట్టి కెలకకుండా ఉంటే తనకు గౌరవంగా ఉంటుందని రాహుల్ తెలుసుకోవాలి. యూనివర్సిటీల్లో ఎక్కడ గొడవ జరిగినా సరే… తాను అక్కడ వాలిపోయి.. మెజారిటీ ఆవేశంలో తాను భాగమైపోయి.. మోడీ సర్కారును నిందించే ఛాన్సు దొరుకుతుందేమో అని రాహుల్ ఆలోచిస్తూ ఉంటే.. ఆయన ప్రధాని కాగోరే నాటికి ఈ దేశం మిగలదేమో!
ఒక విద్యార్థి అరెస్టును నిరసించడం తప్పు కాదు. విద్యార్థి భవిష్యత్తు చెడిపోకుండా.. అతడి మీద దేశద్రోహం లాంటి పెద్దకేసులు కాకుండా, దారి తప్పినప్పటికీ.. అతను కూడా ఈ దేశం బిడ్డే గనుక.. దారిలోకి తెచ్చుకునేలా శిక్షలు ఉండాలంటూ రాజకీయనాయకులు అడిగిన అందులో కాస్త విజ్ఞత ఉన్నట్లు భావించాలి. ఇదే గొడవల్లో కమ్యూనిస్టు నాయకుడు డి.రాజా కూతురు పేరు కూడా అనుమానితుల జాబితాలో ఉంది. అయితే ఇప్పుడు వామపక్ష నాయకులంతా.. కొత్త పాట అందుకున్నారు. వామపక్ష విద్యార్థి విభాగం ప్రతినిధులుగా వారు కార్యక్రమానికి హాజరయ్యారే తప్ప, వారంతా దేశవ్యతిరేక నినాదాలు చేశారని అనడానికి లేదంటూ వాదిస్తున్నారు.
నాయకుడనే వాడికి విచక్షణ ఉండాలి. అది కాస్తా దారితప్పితే.. కన్హయా కుమార్ లాంటి ఆవేశంలో ఉన్న దారితప్పిన ఉద్యమాల బాటలోఉన్న విద్యార్థులు కూడా.. పూర్తి ఆలోచనతో, పూర్తి స్పృహతో ఇలాంటి శక్తులను సమర్థించడానికి చూసే రాహుల్ గాంధీ వారి మీద దేశద్రోహం కేసులు పెట్టాల్సిన ఖర్మం ప్రాప్తిస్తుంది.