రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో గవర్నర్ పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. సచిన్ పైలట్ తిరుగుబాటుతో సీఎం గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మద్దతు నిరూపించుకోవాలని సీఎం గెహ్లాట్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేబినెట్లో తీర్మానం చేసి… అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని గవర్నర్‌కు తీర్మానం పంపారు. అయితే.. గవర్నర్ కల్రాజ్ మిశ్రా మాత్రం… స్పందించడం లేదు. వాస్తవానికి కేబినెట్ నిర్ణయం తీసుకుని… సిఫార్సు చేస్తే.. దాన్ని పెండింగ్‌లో కూడా గవర్నర్ పెట్టరు. కానీ రాజస్థాన్ గవర్నర్ మాత్రం.. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ ముందు ధర్నాకు దిగారు.
ప్రస్తుతం.. గెహ్లాట్ ప్రభుత్వం నిలబడటానికి కావాల్సినంత మద్దతు ఉంది. దీంతో ఆయన విశ్వాసపరీక్షను సులువుగానే గట్టెక్కుతారన్న అంచనాలు ఉన్నాయి., అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు చేసిన పైలట్ వర్గం మొత్తంపై అనర్హతా వేటు పడుతుంది. ఏ కోర్టులు కూడా.. అడ్డుకోలేవు. ఈ కారణంగానే.. అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్న అభిప్రాయం రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సిన గవర్నర్.. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఐదు నుంచి పది మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించగలిగితే… గెహ్లాట్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. బీజేపీ సీరియస్‌గా ఆ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు కొలిక్కి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. గవర్నర్ వ్యవస్థల పనితీరు.. ఇటీవలి కాలంలో.. అనేక రాష్ట్రాల్లో వివాదాస్పదమవుతోంది. గతంలో కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా.. అనేక రాష్ట్రాల్లో.. రాజకీయ పరిణామాలను.. గవర్నర్ ద్వారా బీజేపీ మార్చిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ బీజేపీకి.. గవర్నరే పెద్ద ఆధారంగా మారినట్లయింది.