మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తొలి రోజు ఏడుగురితో విచారణ ప్రారంభించిన సీబీఐ.. రోజులు గడిచే కొద్దీ.. నిపుణుల్ని పిలిపిస్తూ… సభ్యులను పెంచుకుంటోంది. వారం రోజుల్లో పులివెందులలో విచారణ జరుపుతున్న సీబీఐ బృందం సంఖ్య 30కి పెరిగింది. తొలి రోజు.. పోలీసు అధికారులతో సమావేశమైన సీబీఐ బృందం.. రెండో రోజు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించింది. ఆ తర్వాత సిట్ బృందం తయారు చేసిన నివేదికను తీసుకుని… పని ప్రారంభించింది. సొంతంగా ప్రతీ చిన్న విషయాన్ని విశ్లేషించుకుంటూ.. ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి మూడు సార్లు వివేకా ఇంటిని పరిశీలించినట్లుగా చెబుతున్నారు.
హత్య జరిగినరోజు ఏం జరిగిందనే దాని దగ్గర్నుంచి విచారణ ప్రారంభించారు. వాచ్మెన్ రంగయ్య, పీఏ కృష్ణారెడ్డిల దగ్గర్నుంచి అసలు విషయం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వారి విచారణ ప్రారంభమయింది. వైఎస్ కుటుంబంలోని కీలక వ్యక్తులను ప్రశ్నిస్తారని చెబుతున్నారు. విచారణలో భాగం అయిన స్థానిక పోలీసుల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు. మొదట్లో ఏడుగురు బృందమే ఉండటంతో… స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. అప్పుడే.. కేసు దర్యాప్తులో చిన్న విషయం కూడా లీక్ కాకూడదని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ.. దర్యాప్తులో తేలుతున్న విషయాలు లీక్ అవుతున్నాయని అనుకున్నారేమో కానీ.. మెల్లగా స్థానిక పోలీసుల సంఖ్యను తగ్గించి.. తమ సిబ్బందిని.. సీబీఐ అధికారులు పెంచుకున్నారు.
సాక్ష్యాలు తుడవడానికి ప్రయత్నించిన వారు.. మృతదేహానికి కుట్లు కట్టిన వారితో పాటు.. గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసి…, తప్పుదోవ పట్టించాలనుకున్న వారి వ్యవహారంపై ప్రధానంగా సీబీఐ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సాంకేతిక ఆధారాలను ఇప్పటికే సీబీఐ పరిశీలించింది. ఆ రోజు.. వివేకా ఇంటి వద్ద నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ సహా మొత్తాన్ని బయటకు తీసినట్లుగా తెలుస్తోంది. మొదటగా హైదరాబాద్‌కే ఫోన్ కాల్స్ వెళ్లాయనే ప్రచారం జరుగుతోంది. వివేకా కుమార్తెతో పాటు కుటుంబసభ్యులు సీబీఐ అధికారులకు అందుబాటులో ఉండి.. సహకరిస్తున్నారు. దీంతో.. త్వరలోనే మిస్టరీ వీడిపోతుందనే అంచనా వేస్తున్నారు.