ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చినా నేరుగా హైదరాబాదో.. చెన్నైనో వెళ్లిపోయి… అపోలో ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. ఇక డిప్యూటీ సీఎంల సంగతి చెప్పాల్సిన పని లేదు. దీంతో సొంత ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సౌకర్యాలపై వారికే నమ్మకం లేదనే విమర్శలు గట్టిగా వస్తున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం మాత్రం.. తన ప్రభుత్వం అందిస్తున్న చికిత్సపై తాను ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేరారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా సోకింది. టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ అని తెలియడంతో ప్రభుత్వ అంబులెన్స్‌ను పిలిపించుకుని.. అందులోనే ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేకించిన చిరాయు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరి ట్రీట్మెంట్ పొందుతున్నారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా లాక్డౌన్ విధించడానికి రెండు రోజుల ముందుగానే సీఎంగా పదవి పొందారు. అంతకు ముందు అక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉండేది. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఫిరాయించి… బీజేపీలో చేరడంతో.. శివరాజ్‌కు మళ్లీ పదవి లభించింది. ఆ తర్వాత కరోనా విజృంభణ కొనసాగింది. అయితే.. శివరాజ్ ప్రజల్లో ఉండే సీఎంగా పేరు ఉంది . ఆయన కరోనా కట్టడి కోసం తన అనుభవాన్నంతా ఉపయోగించి పని చేశారు. ఇప్పటి వరకూ బాగానే ఉన్న అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నట్లే మధ్యప్రదేశ్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకూ వైరస్ అంటుకుంది. దేశంలో.. ముఖ్యమంత్రి స్థాయి వారికి కరోనా సోకడం ఇదే ప్రథమం.
ముఖ్యమంత్రి రెండు రోజు క్రితం.. పాల్గొనాల్సిన కార్యక్రమాలను స్వల్ప అనారోగ్య కారణాలతో రద్దు చేసుకున్నారు. అవి కరోనా లక్షణాలుగా ఉండటంతో… టెస్టు చేయించుకున్నారు. దీంతో పాజిటివ్‌గా తేలింది. ఈ కారణంగా.. గత కొన్ని రోజులుగా.. తనతో కాంటాక్ట్‌లో ఉన్న అధికారులు, మంత్రులు అందరూ.. టెస్టులు చేయించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.