రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమా గత వారం రోజులుగా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని విలన్ చేస్తాడా, లేక తన సెటైర్లతో కామెడీ పీస్ చేస్తాడా అని భయపడ్డ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే లాగా, పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ, ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాడు అనే సూచనలతో సినిమా ముగిస్తూ, నిజంగానే తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఆర్జివి. అయితే పవన్ కళ్యాణ్ ఓటమి కి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ కి ఆప్తుడైన రాజు రవి తేజ ని పోలిన పాత్ర మీద నెట్టేసి రాంగోపాల్ వర్మ ఎస్కేపిజం ప్రదర్శించాడు అన్న విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
బిజెపి జనసేన కలిసి 2019లో పోటీ చేయాలన్న తమ వ్యూహాన్ని టీవీ9 భంగపరచింది అన్న సోము వీర్రాజు:
2014 ఎన్నికల్లో బిజెపి టిడిపి జనసేన సంయుక్తంగా ముందుకు వెళ్లాయి. అయితే బిజెపి పెద్దల ప్లాన్- 2019 లోపు ఆంధ్రప్రదేశ్ బలపడాలని, జనసేన తో కలసి ముందుకు వెళ్లాలని. అయితే సోము వీర్రాజు ఆమధ్య టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ ఆ ప్లాన్ ని భంగపరిచింది మీరే అంటూ, ఆ చానల్ లోనే టీవీ9 పై విమర్శలు చేశారు. పవన్కళ్యాణ్ భుజంమీద తుపాకీ పెట్టి టిడిపి పెద్దలు వెనకాల నుండి తమ పై కాల్పులు జరిపారని అప్పట్లో సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. అయితే బిజెపి జనసేన వ్యూహాన్ని టీవీ9 ఎలా భంగపరిచింది అన్నది చాలా మందికి అర్థం కాలేదు కానీ బిజెపి లీడర్లకు చాలా మందికి ఈ విషయం తెలుసు. ఎన్నికల తర్వాత ఐవైఆర్ కృష్ణారావు వంటి వారు మాట్లాడుతూ బిజెపితో ఉండి ఉంటే కచ్చితంగా 30-40 సీట్ల వరకు జనసేన కు వచ్చి ఉండేవి అని వ్యాఖ్యానించారు.
బిజెపి ఎదగకుండా, జనసేన తో కలవకుండా వ్యూహం:
2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలి అనుకున్న బీజేపీని ఎదగనీయకుండా చంద్రబాబు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన వ్యూహాలు అమలు చేశాడు. కావూరి సాంబశివరావు, పురందేశ్వరి వంటి కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన స్థాయి నాయకులు బిజెపిలో చేరినప్పటికీ, ఆ పార్టీ బలం పెరగలేదు అంటే దానికి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలే కారణం. రాజకీయ వర్గాల్లో అప్పట్లో వినిపించిన గుసగుసలు, సోము వీర్రాజు టీవీ9 ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యల సారాంశం ఏమిటంటే- 2014 ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదాపై నిలదీయలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత జగన్ ఉన్నాడని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి తో పొత్తు లో ఉండడం వల్ల నేరుగా నిలదీయ లేడని, పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రత్యేక హోదా పై ఉద్యమం మొదలు పెడితే బాగుంటుందని టీవీ9 రవి ప్రకాష్ వంటి కొందరు చంద్రబాబు ప్రోద్బలంతోనే పవన్ కళ్యాణ్ ని ప్రేరేపించారు అని , బిజెపిని ఎదగనీయకుండా చేయడమే కాకుండా, బిజెపి జనసేన ను కలవకుండా చేయడానికి చంద్రబాబు రవి ప్రకాష్ సంయుక్తంగా రచించిన ప్లాన్ ఇది అని.
టీవీ9 రవి ప్రకాష్ మీద రామ్ గోపాల్ వర్మ నెపాన్ని వేయలేక పోయాడా?
పవన్ కళ్యాణ్ తనకు అత్యంత ఆప్త మిత్రుడు అని పలు వేదికలపై రవి ప్రకాష్ అప్పట్లో ప్రకటించాడు. ఆ సమయంలో ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ని ఉద్యమింప చేయడానికి, తద్వారా బిజెపి జనసేన ల మధ్య గ్యాప్ పెరిగేలా చేయడానికి టిడిపి ప్రోద్బలంతోనే రవి ప్రకాష్ వ్యూహం రచించాడనేది కొన్ని గుసగుసల సారాంశం. ఏది ఏమైనా, బిజెపి పెద్దలు వారించినప్పటికీ వినకుండా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పై బలంగా గళం ఎత్తడం,అప్పటి వరకు ప్రత్యేక హోదా టాపిక్ ఎత్తక పోయినా , విధిలేని పరిస్థితుల్లో జగన్ కూడా ఇదే నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. అయితే పవన్కళ్యాణ్ నేరుగా బీ జె పీ ని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తే, జగన్్- చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా రావడం లేదంటూ విమర్శలు చేశారు. మొత్తానికి బిజెపి జనసేన ల మధ్య గ్యాప్ 2019 వరకు అలా పెరుగుతూ పోయింది. 2018 లో సైతం బిజెపి జనసేన తో చేతులు కలపడానికి ప్రయత్నించినప్పటికీ, పవన్ కళ్యాణ్ -ప్రత్యేక హోదా మీద హామీ ఇవ్వకుండా బిజెపితో కలవలేనని వారితో చెప్పడం జరిగిపోయింది అని రాజకీయ వర్గాల సమాచారం. ఒక రకంగా చూస్తే బిజెపి జనసేన 2019 ఎన్నికలకు ముందు కలవలేని పరిస్థితిని సృష్టించడంలో చంద్రబాబు , టీవీ9 రవి ప్రకాష్ విజయవంతం అయ్యారు అనేది ఆ గుసగుసల సారాంశం.
మరి రాజు రవితేజ పై ఆర్జీవీ నెపం ని ఎందుకు వేసినట్లు?
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఇజం అనే పుస్తకం రాసిన రాజు రవితేజ పవన్ కళ్యాణ్ కి అప్పట్లో అత్యంత ఆప్తుడు. దళితుడైన రాజు రవితేజ మాయావతిని బాగా అభిమానిస్తాడు, అలాగే కమ్యూనిస్టు భావాలని కూడా ఇష్టపడతాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా వెర్షన్ ప్రకారం, రాజు రవితేజ లాంటి వారి ఇన్ఫ్లుయెన్స్ వల్లే పవన్ కళ్యాణ్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. బహుశా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంలో రాజు రవితేజ అంగీకారం కూడా కొంత వరకు ఉంటే ఉండవచ్చు కానీ, పూర్తిగా తన ప్రోద్బలం వల్లే పవన్ కళ్యాణ్ పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాడని రామ్ గోపాల్ వర్మ కంక్లూజన్ ఇవ్వడం సమంజసం గా కనిపించలేదు. టీవీ 9 రవి ప్రకాష్ కు , రామ్ గోపాల్ వర్మ కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా, బహుశా రామ్ గోపాల్ వర్మ, రవి ప్రకాష్ పాత్రను పక్కన పెట్టి మొత్తం నెపాన్ని రాజు రవితేజ మీద వేసి ఉండవచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మొత్తం మీద:
మొత్తమ్మద చూస్తే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో పెద్దగా కథ లేదు. వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ కి సమానమైన నిడివితో అరగంట సినిమా తీసి దానికి ప్రేక్షకులతో 150 రూపాయలు వసూలు చేసుకోవడం వర్మ మార్కు గిమ్మిక్కు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఉంటాయేమోనని టికెట్ బుక్ చేసుకున్న వారికి పెద్దగా కిక్ ఇచ్చే అంశాలు ( ఇదివరకే ట్రైలర్ లో చూపించినవి మినహా) ఏమీ లేవు. దానికి తోడు చంద్రబాబు ని నెగిటివ్గా చూపించడం, బుల్ బుల్ కృష్ణ అంటూ పరోక్షంగా బాలకృష్ణ ను గుర్తు చేయడం (బాలకృష్ణ పాడిన సారే జహాసే అచ్చా సాంగ్ గుర్తుండే ఉంటుంది) టిడిపి అభిమానులకు , బాలకృష్ణ అభిమానులకు పెద్దగా మింగుడు పడక పోవచ్చు. రామ్ గోపాల్ వర్మ దశాబ్దకాలంగా సినిమాలు తీస్తున్న “పబ్లిసిటీ ఎక్కువ విషయం తక్కువ ” అన్న జోనర్ లోనే తెరకెక్కిన ఈ సినిమాని 24 గంటల తర్వాత పెద్దగా పట్టించుకునే వారు కూడా ఎవరూ ఉండకపోవచ్చు.
– జురాన్ (@CriticZuran)