ఆడ – మగ డ్యూయెట్ పాడుకోవడం ఆచారం, ఆనవాయితీ.
అదే.. మగ – మగ మధ్య డ్యూయెట్ ఉంటే ఎలా ఉంటుంది?
ఈ ఆలోచన సాధారణంగా అయితే మరెవరకీ రాదు. హాస్య బ్రహ్మ జంథ్యాలకైతే వస్తుంది. అందుకే ఆయన ‘చూపులు కలిసిన శుభవేళ’ చిత్రంలో నరేష్కీ సుత్తి వీరభద్రరావుకీ మధ్య ఈ డ్యూయెట్ తీశారు. మగ – మగ మధ్య డ్యూయెట్ పెట్టడం బహుశా సినిమాల్లో అదే తొలిసారి, చివరిసారి.
ఈ పాట వెనుక చాలా కథ ఉంది. బోలెడంత హాస్యం ఉంది. చెప్పలేనంత విషాదం ఉంది.
నరేష్ లేడీ గెటప్పులకు చాలా ఫేమస్. చిత్రం భళారే విచిత్రంలో నరేష్ వేసిన లేడీ గెటప్.. నభూతో నభవిష్యత్. అయితే.. నరేష్ తొలిసారి ఓ అమ్మాయిగా సిగ్గులు ఒలకబోసిన సినిమా ఇదే. చిన్నప్పటి నుంచీ లేడీ గెటప్ వేయాలన్న ఆశ ఉండేది నరేష్ కు. ఆ విషయాన్నే జంథ్యాలతో పంచుకుంటే.. `ఈ సినిమాలో వేయించేస్తా` అని మాట ఇచ్చారు. అలా.. `చూపులు కలసిన శుభవేళ`లో నరేష్ తో ఈ పాట చేయించారు. ఈ పాటలో రాజశేఖర్ కూడా తళుక్కున మెరుస్తారు. అది కూడా అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనే. `చూపులు కలసిన శుభవేళ` హైదరాబాద్ లో ని ఇందిరా పార్క్లో జరుగుతున్నప్పుడు అక్కడే రాజశేఖర్ నటిస్తున్న `నీకూ నాకూ పెళ్లంట` షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాకీ జంథ్యాలనే దర్శకుడు. కాబట్టి.. రాజశేఖర్ ని ఈ పాటలో ఇరికించే వీలు దక్కింది. ఈ పాట సినిమాలో సూపర్ హిట్. ఇప్పటికీ… టీవీల్లో ఎప్పుడొచ్చినా గుడ్లప్పగించి చూస్తుంటారు. కారణం.. నరేష్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, సుత్తి వీరభద్రరావు చిలిపి వేషాలూ. ఈ పాట అంతలా నవ్వించింది.
అయితే ఈ పాట షూటింగ్ చేస్తున్నప్పుడే సుత్తి వీరభద్రరావు కాలికి గాయమైంది. ఆ గాయంతోనే వీరభద్రరావు నటించేశారు. చివరికి అది తీవ్రరూపం దాల్చి, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. కాలి గాయంతో చికిత్స పొందుతున్నప్పుడే సుత్తి వీరభద్రరావు మృతి చెందారు. సుత్తి చేసిన చివరి సినిమా.. ఇదే. ఆయన డబ్బింగ్ కూడా చెప్పుకోకపోతే… ఆ పాత్రకు జంథ్యాల గొంతు అరువిచ్చారు. అంతేకాదు.. ఈ సినిమాని సుత్తి వీరభద్రరావుకి అంకితం ఇచ్చి తన స్నేహ ధర్మాన్ని నిరూపించుకున్నారు జంథ్యాల.