రఘురామకృష్ణరాజును వీలైనంత సైలెంట్‌గా ఉంచాలని వైసీపీ ప్రయత్నిస్తూంటే.. మంత్రి అవంతి శ్రీనివాస్.. హఠాత్తుగా ఆయనను కెలికేశారు. గంటా అనుచరుడు నలంద కిషోర్ మృతి పోలీసుల హత్యేనంటూ… ఆర్ఆర్ఆర్ చేసిన ప్రకటనలపై స్పందించేందుకు మీడియా సమావేశం పెట్టిన అవంతి శ్రీనివాస్.. టీడీపీ నేతలపై.. విమర్శలు చేసినట్లుగా దూకుడుగా మాట్లాడేశారు. ఉత్తరాంధ్ర జోలికొస్తే సహించబోమని భారీ డైలాగ్ కూడా కొట్టారు. జగన్ చరిష్మాతో ఎంపీగా గెలిచారని.. పార్టీ విధానాలు నచ్చకుండా రాజీనామా చేయాలన్నారు. నలంద కిషోర్ మృతికి.. వైసీపీకి సంబంధం లేదన్నారు. కరోనా ఎవరికైనా వస్తుందని.. చెప్పుకొచ్చారు.
వైసీపీ నుంచి ఎవరు తనపై స్పందించినా… తక్షణం కౌంటర్ ఇచ్చేందుకు.. రెడీగా ఉండే.. ఆర్ఆర్ఆర్.. అవంతికి కూడా.. నిమిషాల్లోనే రిప్లయ్ ఇచ్చారు. కరోనా ఎవరికైనా వస్తుందనే జ్ఞానామృతాన్ని ప్రజలకి తెలియజేసినందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నానని సెటైర్ తో ప్రారంభించి… నలంద కిషోర్‌ను కర్నూలుకు తీసుకెళ్లడం వల్లనే ప్రస్తుత పరిస్థితి వచ్చిందని తేల్చారు. ముమ్మాటికి పోలీసు హత్యేనన్నారు. తాను.. జగన్ చరిష్మాతో పాటు.. తన చరిష్మాతో కూడా గెలిచానని.. ఎన్నో సార్లు చెప్పానని.. అవంతిలాగా… తాను జగన్ ఒక్కరి వల్లే గెలవలేదని స్పష్టం చేశారు. తన దృష్టిలో.. మెజార్టీ ప్రజలు అమరావతినే రాజధానిగా సరిపోతుందని కోరుకుంటున్నారని తేల్చారు. చివరికి సాక్షిలో.. అవంతి ఇచ్చిన ప్రకటలను గుర్తుకు చేశారు. ఆ ప్రకటనలు ఇచ్చినందుకు పదవి పదిలంగా ఉండాలని ఆశిస్తున్నారని ఫనిషింగ్ టచ్ ఇచ్చారు.
రఘురామకృష్ణరాజుపై ఇప్పుడు వైసీపీ తీసుకోవడానికి ఎలాంటి చర్యలూ మిగిలి లేవు. ఇక సస్పెండ్ చేయడమే మిగిలి ఉంది. అది చేస్తే.. ఆయన మరింతగా రెచ్చిపోతారేమో అన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఆర్ఆర్అర్ మాత్రం.. తన దూకుడు రోజువారీగా సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై లేఖలు రాస్తున్నారు. ఏదైనా జరిగితే.. విపక్షాల కంటే ముందే స్పందిస్తున్నారు. వైసీపీ నేతలు ఎవరైనా తనను విమర్శిస్తే.. అంతకు మించిన అవకాశం దొరకదన్నట్లుగా… కౌంటర్ ఇస్తున్నారు. ఆర్ఆర్ఆర్తో డీల్ చేయడం వైసీపీకి కష్టంగా మారింది.