చిత్తూరు జిల్లా మదనపల్లె రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ పంపుతానన్న సోనూసూద్.. గంటల్లోనే ఆ హామీని నిలబెట్టుకున్నాడు. సోనాలిక ట్రాక్టర్ డీలర్ తో మాట్లాడి.. రైతు నాగేశ్వరరావుకు సాయంత్రానికే.. ట్రాక్టర్ అందేలా ఏర్పాటు చేశారు. ఆ రైతు పిల్లలు బాగా చదువుకోవాలని… సోనూసూద్ ఆకాంక్షించారు. ఇచ్చిన మాటను గంటల్లోనే నిలబెట్టుకున్న సోనూసూద్ పై.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించింది. ఈ విషయం తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సోనూసూద్‌కు నేరుగా ఫోన్ చేశారు. అభినందనలు తెలిపారు. ఆయన ఆకాంక్షించినట్లుగా… రైతు నాగేశ్వరరావు పిల్లల చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. దీనిపై.. సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మదనపల్లి సమీపంలోని గ్రామానికి చెందిన నాగేశ్వరరావు.. ఓ టీకొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. తనకు ఉన్న కొద్దిపాటి పొలంలో టమోటాలు .. ఇతర పంటలు పండించినా.. గిట్టుబాటు ధర రాకపోతూండటం.. నష్టమే మిగులుతూండటంతో.. టీ కొట్టుపైనే ఆధారపడేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా.. ఆ చిన్న టీకొట్టు కూడా… మూతబడిపోయింది. దీంతో ఆదాయం పడిపోయింది. ఇక వ్యవసాయం చేసుకోవడం తప్ప.. మరో ఆప్షన్ లేకపోయింది. తనకు ఉన్న కొద్ది పొలంలో… పొలం దున్ని.. విత్తనాలు వేయడానికి అవసరమైన సరంజామా లేదు. అలాగని.. అద్దెలకు తెచ్చుకునేంత స్థోమత లేదు. దాంతో.. తన ఇద్దరు ఆడపిల్లలను కాడెద్దుల స్థానంలో చేర్చి… తన భార్యతో విత్తనాలు వేయిస్తూ.. పంట వేయడం ప్రారంభించారు. గ్రామంలోని వారు ఇది చూసి.. వీడియో తీశారు. అది మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.. సోనూసూద్ వరకూ వెళ్లింది.
సోనూసూద్ ట్రాక్టర్ పంపిన తర్వాత.. ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనేక మంది సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. అలాగే టీడీపీ అధినేత కూడా తెలిపారు. ఆయన ఆకాంక్ష అయిన ఆ పిల్లల్ని చదివిస్తామని హామీ ఇచ్చారు. సోనూసూద్ లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కువగా వలస కూలీలకు సాయం చేశారు. ఇప్పుడు.. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికీ..తన దృష్టికి వచ్చిన వారికీ.. సాయం చేస్తున్నారు. మంచి మనిషిగా గుర్తింపు పొందుతున్నారు.