ఖైరతాబాద్‌లో మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు బ్యాంకుకు తాకట్టు పెట్టిన ఓ భూమిని ఆ బ్యాంక్ అధికారులు వేలం వేశారు. అయితే.. అది ప్రభుత్వ స్థలమని.. దానం నాగేందర్.. బ్యాంక్ అధికారులపై దౌర్జన్యం చేశారు. అక్కడ స్కూల్ ఉండేదని… ఆ ప్రాంతాన్ని ఇతరులకు ఎలా ఇస్తారని.. మండిపడ్డారు. దానంతో పాటు.. ఆయన అనుచరులు బ్యాంకు అధికారులను ఆ స్థలం నుంచి నెట్టేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కలకలం రేగింది. అది ప్రభుత్వ స్థలం అయితే.. కావూరు సాంబశివరావు ఎలా బ్యాంకులో తాకట్టు పెట్టారనేది.. మొదటిగా వచ్చే సందేహం.
ఖైరతాబాద్‌లోని వివాదాస్పద స్థలంలో మొదట ప్రభుత్వ పాఠశాలే ఉండేది. అది శిథిలమవడంతో.. పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించారు. దాంతో ఆ స్థలం ఖాళీగా ఉంది. అయితే అది ప్రభుత్వ స్థలమా.. కాదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఎవరూ కూడా అది తమ స్థలం అని క్లెయిమ్ చేసుకుంటూ బోర్డులు పెట్టలేదు. హఠాత్తుగా.. ఆ స్థలాన్ని తనఖా పెట్టి కావూరు సాంబశివరావు లోన్ తీసుకున్నారని.. తిరిగి చెల్లించలేదని తేలింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత.. బ్యాంక్ అధికారులు ఆ స్థలాన్ని వేలం వేసి.. ఇతరులకు అమ్మేశారు. వారి నిబంధనల ప్రకారం… ఆ స్థలానికి ఫెన్సింగ్ వేసి.. కొనుగోలుదారుడికి అప్పగించేందుకు వచ్చారు. అక్కడే దానం నాగేందర్ రంగంలోకి దిగారు.
ఆ స్థలం ప్రభుత్వానిది అయితే.. దానం నాగేందర్ ఎమ్మెల్యే హోదాలో వచ్చి.. బ్యాంక్ అధికారులపై దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ అధికారులకు చెబితే వారు పూర్తి చేస్తారు. కానీ ఆయన… ఓ కబ్జా దారుడిగా.. ఆ స్థలం నుంచి… బ్యాంకు అధికారుల్ని వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. అంటే బ్యాంక్ అధికారులు ఆ స్థలాన్ని పట్టించుకోకుండా వదిలేయాలన్నది ఆయన ఉద్దేశం. ప్రభుత్వ స్థలం అయితే.. జీహెచ్ఎంసీ అధికారులే మార్కింగ్ వేసుకుని.. బోర్డు పెట్టేసుకుని ఉండేవారు. ప్రైవేటు స్థలం అనే పక్కా రికార్డులు ఉన్నాయని… బ్యాంక్ అధికారులు పోలీసులకు చూపించి.. తర్వాత వారి సమక్షంలోనే ఆ స్థలానికి ఫెన్సింగ్ వేశారు. ఒక వేళ అది ప్రైవేటు స్థలం అయితే దానం.. దౌర్జన్యం మాత్రం.. తప్పే. దానిపై చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వ స్థలం అయితే.. కావూరు సాంబశివరావు ఎలా తాకట్టుపెట్టగలిగారనేది.. పెద్ద స్కామ్ అవుతుంది.