ఆగస్టు 1 నుంచి థియేటర్లు తెరచుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో.. చిత్రసీమలో ఆశలు రేగుతున్నాయి. సినిమాలు సిద్ధం చేసుకుని, థియేటర్ల కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలకు ఉపశమనం కలిగించే వార్త ఇది. థియేటర్లు తెరచుకునే విషయంలో ప్రభుత్వ నిబంధనలేంటి? అనుమతులు ఎలా ఇవ్వబోతున్నారు? మార్గ దర్శకాలేంటి? అనే విషయాలు ఇంకా తెలీవు గానీ, అవి కూడా ఓ కొలిక్కి వచ్చేస్తే, సినిమా సందడి తప్పకుండా మొదలయ్యే ఛాన్సుంది.
వి, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, అరణ్య, ఉప్పెన లాంటి సినిమాలు ఎప్పుడో సిద్ధమైపోయాయి. ఇవి కాకుండా రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు మరో అరడజను వరకూ ఉన్నాయి. ఇవన్నీ థియేటర్ల రీ ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆగస్టు 1 నుంచి థియేటర్లు తెరచుకుంటే.. ప్రేక్షకులకు సినిమా మళ్లీ అలవాటు కావడానికి కొంత కాలం పడుతుంది. కనీసం దసరా నాటికి పరిస్థితులు చక్కబడతాయి. 25 శాతం ఆక్యుపెన్సీతో మొదలైనా, క్రమక్రమంగా అది 50 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఇది చాలు.. కనీసం చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహం రావడానికి. ఏదో ఓ రేటుకి ఓటీటీకి సినిమా అమ్ముకోవడం కంటే, 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాని థియేటర్లలో వదులుకోవడమే నయం. అందుకే నిర్మాతలు ఇప్పుడు దసరా వరకైనా ఎదురు చూద్దాం.. అన్న నిర్ణయానికి వచ్చారు. మరి.. ప్రభుత్వ నిబంధనలేంటి? థియేటర్ల విడుదలకు ప్రభుత్వం పెట్టే షరతులేంటి? అనే విషయాలు బయటకు వస్తే – ఈ విషయంలో మరింత స్పష్టత రావొచ్చు.