కరోనా కట్టడి, మీడియా బులెటిన్ల విషయంలో తెలంగాణ సర్కార్‌పై విరుచుకుపడుతున్న హైకోర్టు… తాజాగా తీసుకున్న చర్యలపైనా… సంతృప్తి వ్యక్తం చేయలేదు. ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయంతో ఉంది. కరోనా విషయంలో తాము ఇస్తున్న ఆదేశాలు అమలు చేయడం లేదని.. హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు పట్టించుకోకపోవడం దురదృష్టకమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన మీడియా బులెటిన్‌లోనూ పూర్తి వివరాలు లేవని.. ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. జూన్ 8 నుంచి తాము ఆనేక ఆదేశాలు ఇచ్చామని.. ఒక్క ఉత్తర్వు కూడా అమలు చేయలేదన్నారు. అమలు చేయడం సాధ్యం కాకపోతే… ఎందుకు సాధ్యం కాదో చెప్పాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారాలన్నింటిపై మంగళవారం .. చీఫ్ సెక్రటరీనే అడుగుతామని… మంగళవారానికి హైకోర్టు కేసును వాయిదా వేసింది. మంగళవారం.. తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.. హైకోర్టు ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కరోనా కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టులో పెద్ద ఎత్తున ప్రజా ప్రయోజన వ్యాజ్యలు దాఖలవుతున్నాయి. టెస్టులు చేయడం లేదని.. వైద్యం అందడం లేదని.. ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని.. బెడ్లు దొరకడం లేదని..ఇలా అనేక అంశాలపై పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిపై విచారణలో హైకోర్టు ప్రభుత్వానికి అనేక సూచనలు.. చేస్తోంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో హైకోర్టు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను గాలికి వదిలేశారని.. వారికి జీవించే హక్కు ఉందని పలుమార్లు గుర్తు చేసింది.
అయితే.. హైకోర్టు అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణకు స్వీకరించి.. అధికారులను పిలిపించడం వల్ల.. వారంతా…. కరోనా కట్టడి చర్యలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్నట్లుగా… ఓ అభిప్రాయాన్ని మీడియాకు తెలిపింది. అయితే.. ఆ తర్వాత ప్రభుత్వం … మీడియా బులెటిన్ విషయంలో… కాస్త తగ్గింది. కొత్త ఫార్మాట్లో బులెటిన్ విడుదల చేస్తున్నారు. అందులో… 90 శాతానికిపైగా బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న వివరాలు ఉన్నాయి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల బెడ్లకు సంబంధించిన వివరాలు లేవు. ఏ ఏ ఆస్పత్రిలో ఖాళీలు ఉన్నాయో చెప్పలేదు. ఈ కారణంగానే… హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది.