సచివాలయం కూల్చివేత అత్యంత రహస్యంగా.. మీడియాను అనుమతించకుండా జరుగుతూండటంతో హైకోర్టులో పిటిషన్లు దాఖలవడం.. విచారణ కూడా జరుగుతూండటంతో.. ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలు ఇవ్వక ముందే.. కూల్చివేతల వద్దకు మీడియాను అనుమతించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియాకే తెలిపారు. స్వయంగా.. తామే.. కూల్చివేతల ప్రదేశానికి తీసుకెళ్తామని చూపనున్నట్లు ఆయన ప్రకటించారు. కూల్చివేత వార్తలను ప్రజలకు ఇచ్చేందుకు అనుమతించాలని మీడియా సంస్థలు విజ్ఞప్తి చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు.
అయితే.. ప్రభుత్వం ఇక్కడ ఓ లిటిగేషన్ పెట్టింది. అదేమిటంటే.. నేరుగా మీడియాను అనుమతించడం లేదు. అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో… తామే అక్కడకు తీసుకెళ్తామని చెబుతోంది. స్వయంగా కూల్చివేతలను చూపిస్తామని అంటోంది. అంటే.. ఓ గంట లేదా రెండు గంటలు… మీడియా ప్రతినిధుల కవరేజీకి చాన్స్ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ క్లోజ్ చేసే అవకాశం ఉంది. అయితే.. మీడియా ప్రతినిధులు మాత్రం.. తమపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని… కూల్చివేతల ప్రక్రియపై నిరంతరంగా రిపోర్టింగ్ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీనిపైనే హైకోర్టులో పిటిషన్లు వేశారు.
కూల్చివేత ప్రక్రియను.. దూరంలో ఉన్న భవనాల పై నుంచి.. ఎంత అవకాశం ఉంటే.. అంత మేర దృశ్యాలను మీడియా చానళ్లు ప్రజలకు అందిస్తున్నాయి. కానీ దగ్గరకు మాత్రం వెళ్లలేదు. కనీసం.. భద్రతా సిబ్బంది.. కూల్చివేతల్లో పాల్గొనేవారు కూడా.. ఆ దృశ్యాలను చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే దాదాపుగా కూల్చివేత ప్రక్రియ 70 శాతం వరకూ పూర్తయిందని చెబుతున్నారు. మరో వారం మొత్తంగా కూల్చివేత అయిపోతుందని.. శిథిలాల తొలగింపుకే కొంత సమయం పడుతుందన్న అంచనా ఉంది. ఇప్పుడు మీడియా కవరేజీకి అనుమతించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.