మూడుపదులవయసు మీదపడి.. తలవెంట్రుకలు పలుచబడుతున్నా.. పెళ్లికానివారి సంఖ్య పెరుగుతోంది. వధువులు కరువైపోయి కుర్రాళ్ళు బెంగపెట్టుకోవాల్సిన పరిస్థితి. మ్యారేజ్బ్యూరోలెన్స్, పెళ్ళిళ్ళ పేరయ్యలవద్ద అబ్బాయిల ఫొటోలు, బయోడేటాలు సంచులనిండా ఉంటున్నాయి. వారికి సూటయ్యే అమ్మాయిల ఫొటోలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతంలో అయితే అబ్బాయిలకు డిమాండ్ ఉండి నచ్చిన అమ్మాయిని ఏరుకుని చేసుకునేవారు. ఆ ఛాయస్ ఇప్పుడు పూర్తిగా అమ్మాయిలచేతుల్లోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు చెప్పినట్లుగా పెళ్ళికి ఒప్పేసుకోవడానికి అమ్మాయిలెవరూ రెడీగాలేరు. నాకు నచ్చితేనే పెళ్ళి అని తెగేసి చెబుతున్నారు.
జనాభాలెక్కల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 20నుండి 25 సంవత్సరాలు మధ్యవయసుగలవారు 5,25,818మంది ఉండగా వీరిలో 2,79,825మంది అబ్బాయిలు, 2,51,993మంది అమ్మాయిలున్నారు. అంటే అబ్బాయిలకంటే అమ్మాయిలు 21,832మంది తక్కువగా ఉన్నారు. ఆ వ్యత్యాసమే 35ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి కాకపోవడానికి కారణంగా చెబుతున్నారు. దక్షిణ భారత దేశమంతా ఇంచుమించు ఇదే పరిస్ధితి. 40ప్లస్‌లో పడినప్పటికీ కొన్నివర్గాల్లో పెళ్లికానివారు అనేకమంది ఉన్నారు. జీవితకాలం 60ఏళ్ళుగా చెబుతుంటుంటే మరి 40ఏళ్లకు పెళ్లి కానప్పుడు వీరి జీవితం ప్రశ్నార్ధకం కాకేమిటీ? పెళ్ళీడు వయసులో అనేక సంబంధాలు వచ్చినప్పటికీ మంచి ఉద్యోగం, ఆర్ధికంగా స్థిరపడ్డాక చేసుకుంటామని తోసిపుచ్చారు. అదే ఇప్పుడు వారికి శాపంగా మారింది.
అబ్బాయిలమాదిరిగా అమ్మాయిలు ఎక్కువకాలం పెళ్ళి చేసుకోకుండా ఉండే సంప్రదాయం మనదికాదు. అందువలనే మూడుపదుల వయసు దాటిన తర్వాత పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు లేక సతమతం కావాల్సి వస్తోంది.
ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ లక్ష్మీదేవీ పుట్టిందనుకునే పుణ్యభూమి మనది. ముక్కోటి దేవతలను పూజిస్తాం. స్త్రీలను దేవతలుగా ఆరాధిస్తాం. మహిళను మాతృమూర్తిగా పరిగణించే సంస్కృతి మనది. అలాంటి ప్రాముఖ్యత గల స్త్రీలు కనుమరుగైపోవడానికి కారణం భ్రూణహత్య(అబార్షన్)లే. ఆర్ధిక, సామాజిక పరిస్థితులవల్ల పాతికేళ్ళక్రితం అబార్షన్లద్వారా ఆడశిశువును భూమిమీద పడకుండానే ప్రాణం తీసేవారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో గర్భస్థ శిశువు ఆడో, మగో తెలుసుకునేందుకు లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆడబిడ్డ అయితే ఈ దారుణానికి ఒడిగట్టేవారు. ఇప్పుడు అంత దారుణం లేకపోయినప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అందుకనే అబ్బాయిలకు ఈ గడ్డుపరిస్థితి వచ్చింది.
కొందరైతే కులమతాలు, కట్నకానుకలను పక్కనపెట్టి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెనకాడడంలేదు. కొందరు కులాంతర సంబంధాలు కుదుర్చుకుని బంధువులు, ఇరుగుపొరుగువారికోసం ప్రేమవివాహమని పేరు పెట్టి దగ్గరుండి పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు. అలాగే కులాలవారీగా వధూవరుల పరిచయవేదికలు ఏర్పాటుచేసి పెళ్ళిళ్ళు నిశ్చయించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
ఈ మధ్య రాజమండ్రిలో ఓ కులం వధూవరుల పరిచయవేదిక జరిగింది. ఈ వేదికలో అబ్బాయిల పరిస్థితిని చూస్తే ఎవరికైనా జాలి వేయకమానదు. ఈ పరిచయవేదికలో 480మంది అబ్బాయిలు(దరఖాస్తులతోపాటు) వచ్చారు. అమ్మాయిలు ఎంతమందో తెలుసాయయ.. 102మంది. అయితే ఈ అమ్మాయిల కోరికలు చూడండి.. 102మందిలో 61మంది ఉద్యోగస్తులే కావాలన్నారు. 12మంది అంగవైకల్యం ఉన్నవారున్నారు. అయితే అబ్బాయిలు 480మందిలో ఉద్యోగస్తులు 26మందే. అంటే ఈ లెక్కన ఉద్యోగస్తులు కాని అబ్బాయిలు వీరిని పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్న అమ్మాయిలసంఖ్య ఎక్కడా పొంతనలేదు. ఇటువంటి పరిస్థితే చాలా కులాల పరిచయవేదికలో అబ్బాయిలకు రాష్ట్ర మంతటా ఎదురవుతుందని మ్యారేజ్‌బ్యూరో ప్రతినిధి తెలిపారు.