ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటిన నాలుగో రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత… నాలుగో స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. మూడు మహానగరాలు ఉన్న రాష్ట్రాలు. ఢిల్లీ దేశ రాజధాని. కానీ ఏపీలో ఓ మాదిరి మెట్రో సిటీ కూడా లేదు. కానీ పాజిటివ్ కేసులు లక్ష దాటిపోయాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 6051 మందికి పాజిటివ్ సోకినట్లుగా గుర్తించారు. 49 మంది చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 1090చేరింది. డిశ్చార్జ్ అయిన వారు పోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 51701గా తేలాయి. గత రెండు, మూడు రోజులతో పోలిస్తే… కేసుల సంఖ్య తగ్గింది. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం.. మరోసారి రోజువారీ కేసులు వెయ్యి దాటాయి.
మొదట్లో కృష్ణా జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండేవి. అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్న జిల్లాగా ఉండేది. అయితే.. ఇతర జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. ఇప్పుడు కృష్ణా జిల్లాలో మాత్రం కట్టడి అయినట్లుగా ఉంది. పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కృష్ణా జిల్లాలో మాత్రం.. వంద.. నూటయాభై కేసుల్లోపే నమోదవుతున్నాయి. డిశ్చార్జ్ లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో యాక్టివ్ కేసులు 1362 మాత్రమే. ఏపీలోని అన్ని జిల్లాల కంటే ఇవి తక్కువ. అత్యధిక యాక్టివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. పదివేలకు చేరువలో అక్కడ కరోనా బారిన పడి కోలుకోవాల్సిన వారు ఉన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో వైరస్ కంట్రోల్ అవుతోంది. అక్కడ వెయ్యికి కొద్దిగా అటూ ఇటూగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత కేసుల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. కానీ అక్కడ వైరస్ కంట్రోల్ అవుతూండటం.. ఏపీలో… రోజుకు ఆరు నుంచి ఎనిమిదివేల కేసులు నమోదవుతూండటంతో.. ఈ వారంలోనే… ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల్లో రెండో స్థానానికి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ వాతారవణం ఎక్కువగా ఉన్న మరే రాష్ట్రంలోనూ…. ఇలా కరోనా వైరస్ విస్తరించడం లేదు.