పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీనును జైల్లో చంపేసిన ఓంప్రకాష్ .. చనిపోయారు. ఆయన ప్రస్తుతం విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. రాత్రి ఆయనకు శ్వాసకోశ సమస్య రావడంతో.. కేజీహెచ్‌కు తరలించారు. మధ్యాహ్నంలోపు చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. మదనపల్లెకు చెందిన ఓంప్రకాష్.. ఓ లారీ చోరీ కేసులో 2008లో అరెస్టయ్యాడు. అక్కడ మొద్దు శీనును ఉంచే సెల్లో ఉంచారు. అక్కడ ఓ రాత్రి.. డంబెల్‌తో మొద్దుశీనును ఓంప్రకాష్ కొట్టి చంపారు. తాను రామకోటి రాసుకుంటూంటే.. డిస్టర్బ్ చేస్తే డంబుల్ తీసుకొని హత్య చేసినట్టుగా ఓం ప్రకాశ్ అప్పట్లో చెప్పారు. అసలు సెల్‌లోకి డంబెల్స్ ఎలా వెళ్లాయనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగా ఉంది.
పరిటాల రవి హత్య కేసుతో సంబంధం ఉన్న వారంతా.. ఒక్కొక్కరుగా మరణించడంతో.. అప్పట్లో కలకలం రేపింది. పరిటాల రవి హత్య తర్వాత మొద్దు చాలా కాలం కనిపించలేదు. టీవీ చానళ్లకు కూడా ఇంటర్యూలు ఇచ్చిన ఆయన.. ఢిల్లీలో మకాం పెట్టారు. అప్పుడప్పుడూ హైదరాబాద్ వస్తూ దందాలు చేసేవాడు. ఓ సారి చందానగర్ లాడ్జిలో బాంబులు తయారు చేస్తూ.. ప్రమాదవశాత్తూ పేలడంతో పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఓం ప్రకాష్ చేతిలో హతమయ్యాడు. దాంతో అనేక నిజాలు బయటకు రాకుండా ఉండిపోయాయి. ఆ తర్వాత కూడా.. పరిటాల రవి హత్యతో లింకులు ఉన్న వాళ్లు వరుసగా చనిపోయారు. చివరికి ఇప్పుడు మొద్దు శీను హంతకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఓం ప్రకాష్‌కు కిడ్నీల సమయ్య ఉందని… ఎప్పటికప్పుడు డయాలసిస్ చేపిస్తున్నామని.. జైలు సూపరింటెండెంట్ చెబుతున్నారు. మొన్న కూడా కేజీహెచ్‌లోనే డయాలసిస్ చేయించామని… ఆ తర్వాత సమస్య వచ్చిందన్నారు. శ్వాస సమస్య ఉందని చెప్పడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వచ్చామని మధ్యాహ్నానికి చనిపోయాడని.. జైలు సూపరింటెండెంట్ చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉందన్నారు.