ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను నియమించారు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా. కన్నా లక్ష్మీనారాయణ పదవీకాలం ముగియడం, ఆర్ఎస్ఎస్ వర్గాల ఫేవరెట్ గా ఉన్న సోము వీర్రాజు అంతర్గతంగా పావులు కదపడం, వంటి అనేక కారణాలతో సోము వీర్రాజు అధ్యక్షుడిగా నియమించబడ్డాడు అన్న చర్చ జరుగుతోంది . వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో బీసీ నేత లక్ష్మణ్ ని మార్చి బండి సంజయ్ కు పదవి పగ్గాలు సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కన్నా లక్ష్మీనారాయణ ని మార్చి ఆ స్థానంలో వేరే వారిని నియమిస్తారని ఊహాగానాలు వచ్చినప్పటికీ అప్పట్లో జాతీయ నాయకత్వం ఈ విషయమై నిర్ణయం తీసుకోలేదు. అయితే కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల గవర్నర్‌కి, అమరావతి కి మద్దతు ఇస్తూ రాసిన లేఖపై పార్టీలో చర్చ జరగడం , ఆ లేఖపై సునీల్ దియోధర్ కి కొన్ని అభ్యంతరాలు ఉండడం కూడా కన్నా లక్ష్మీనారాయణ కి ఉద్వాసన పలకడానికి కారణం అయి ఉండవచ్చన్న చర్చ ఒక వైపు నడుస్తుంటే, కన్నా లక్ష్మీనారాయణను జాతీయ కార్యవర్గం లోకి తీసుకోనున్నారు అన్న చర్చ మరొకవైపు నడుస్తోంది. ఇదిలా ఉంటే, మరొక బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కి తెర వెనుక కొందరు వైఎస్ఆర్సిపి నేతలతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన అభ్యర్థిత్వాన్ని జాతీయ నాయకత్వం అసలు పరిశీలించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తో పోలిస్తే కొంచెం ఎక్కువ దూకుడుతో వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ బిజెపి ని ఈయన ఏ విధంగా ముందుకు నడిపిస్తారో వేచిచూడాలి.