కరోనా మరణాలపై రాజకీయ పార్టీల మధ్యే కాదు.. మీడియా సంస్థల మధ్య కూడా.. వార్ ప్రారంభమయింది. తెలంగాణ ప్రభుత్వ పెద్దల సొంతమైన నమస్తే తెలంగాణ… ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడానికి ఏ మాత్రం సందేహించని.. ఆంధ్రజ్యోతి మధ్య ఈ వార్ ప్రారంభమయింది. గత వారం… కరోనా మరణాలను ప్రభుత్వం దాచేస్తోందంటూ.. ఆంధ్రజ్యోతి.. ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. శ్మశాన వాటికల వద్ద కాపలా ఉండి.. ఫోటోలు.. దృశ్యాల సహితంగా..ఎన్నెన్ని మృతదేహాలు వస్తున్నాయో… ఏ పద్దతిలో వస్తున్నాయో.. మొత్తం వివరించి సమగ్ర కథనం రాసింది. ఒక్క రోజే యాభైకిపైగా మరణాలు సంభవిస్తే.. ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పది లోపే ఉన్నాయని తేల్చింది. ఇది ప్రజల్లో చర్చకు కారణం అయింది. విపక్ష రాజకీయ నేతలకు అస్త్రంగా మారింది.
ఈ కథనంపై ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా మండిపడ్డారు. రోజుకు వెయ్యి మంచి చనిపోతూంటారని.. వారందరివీ కోవిడ్ మరణాలే అని.. ఓ ప్రెస్మీట్లో విరుచుకుపడ్డారు. ఈ పాయింట్ నమస్తే తెలంగాణకు నచ్చిందేమో కానీ.. వెంటనే రంగంలోకి దిగి… ఆంధ్రజ్యోతి ప్రకటించిన … ఖననాలన్నీ సాధారణ మరణాలేనన్నట్లుగా ఓ కథనం రాసింది. నిజానికి ఇక్కడ సింపుల్ లాజిక్ ఉంటుంది. సాధారణ మరణాలైతే.. కుటుంబసభ్యులు అంతిమ సంస్కార వాహనంలో తీసుకు వస్తారు. కోవిడ్ మరణాలైతేనే అంబులెన్స్‌ల్లో తీసుకువచ్చి అత్యంత జాగ్రత్తగా దహనం చేస్తారు. అయితే.. ఇదేమీ పట్టించుకోని.. నమస్తే తెలంగాణ … కొన్ని విచిత్రమైన వాదనలతో అవన్నీ.. సహజమరణాలేనని తేల్చేసి.. ఆంధ్రజ్యోతిపై విమర్శలు చేసింది.
అయితే ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి సేకరించలేకపోయిన కొంత సమాచారాన్ని కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది. కరోనా చికిత్సల కోసం ప్రత్యేకించిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో కరోనా మరణాలు భారీగా పెరిగాయనే విషయం స్పష్టంగా చెప్పింది. గాంధీ ఆసుపత్రిలో ఏప్రిల్‌లో 113 మంది, మే నెలలో 189 మంది, జూన్‌లో 344 మంది, జూలైలో 369 మంది చనిపోయినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది. అయితే.. అధికారిక లెక్కల ప్రకారం.. తెలంగాణలో కరోనా మరణాలు 500 దాటలేదు. గాంధీలో వేరేవారిని చేర్చుకోవడం లేదు కాబట్టి.. ఆ మరణాలన్నీ కరోనా మరణాలేనని.. ప్రభుత్వం సమాచారాన్ని దాస్తోందని… నమస్తే తెలంగాణనే చెబుతోందని.. ఆంధ్రజ్యోతి ఈ రోజు కౌంటర్ ఇచ్చింది.
టీఆర్ఎస్ నేతలు.. రాజకీయంగా… విపక్షాలపై ఎటాక్ చేస్తూంటే.. నమస్తే తెలంగాణ మీడియా పరంగా ఆ బాధ్యత తీసుకుంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పత్రికలపై ..మీడియా సంస్థలపై విరుచుకుపడుతోంది. అయితే.. ఈ క్రమంలో.. కొన్ని వాస్తవాలను బయట పెట్టి… వాటికి అదనపు బలం ఇస్తోంది తప్ప… గట్టిగా వాదన వినిపించలేకపోతోంది.