చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన దళిత రైతు నాగేశ్వరరావుకు సోనూసూద్ సాయం చేశారు. ఇక్కడ ప్రభుత్వానికేం సంబంధం లేదు. ఆయన కుమార్తెలతో కలిసి కాడి దున్నుతున్న వీడియో వైరల్ కావడం.. అది సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో సాయం చేశారు. కానీ.. ఎందుకో కానీ… అది ప్రభుత్వానికి నచ్చలేదు. ఆయన కడు పేదవాడు కాదని.. ఆయన చరిత్రను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కొంత మంది అధికారులు.. ఆయన ఇంటికి వెళ్లారు. ఇల్లు మొత్తాన్ని పరిశీలించారు. ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత అధికారులు.. ఆ రైతుకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయని… ప్రకటించారు. అమ్మఒడి పది వేలు.. రైతు భరోసా నిధులు వచ్చాయన్నారు. వైసీపీకి చెందిన కొంత మంది… ఆయన పేదవాడు కాదని.. 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారని.. విమర్శలు ప్రారంభించారు.
సోషల్ మీడియాలో ఆయనపై ఒక్క సారిగా దాడి పెరగడంతో… దళిత రైతు నాగేశ్వరరావు మనస్తాపానికి గురయ్యారు. అధికారులు వచ్చి విచారణ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తాము ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడామా అని ప్రశ్నించారు. ఎక్కడో ముంబైలో ఉన్న సోనూసూద్ సాయం చేస్తే… ఇక్కడ ఎందుకు తనపై దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. కొంత మంది తాము లావుగా ఉన్నామని.. శరీర రంగు గురించి మాట్లాడుతున్నారని… పేదరికాన్ని అలా కొలుస్తారా అని ప్రశ్నించారు.
దళిత రైతు నాగేశ్వరరావు ఉదంతం.. జాతీయ స్థాయిలో కలకలం రేపడంతో.. ప్రభుత్వం.. అది తమకు షేమ్ అని ఫీలయిందేమో కానీ… ఆయన పేదవాడు కాదని చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే.. నాగేశ్వరావు కాస్త చదువుకున్న అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అదే ఆయన ఆస్తి. ఆయన సంపదపరుడేమీ కాదు. వ్యవసాయం కలసి రాదని.. మదనపల్లెకి వెళ్లి టీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నారు. ఇద్దరు కుమార్తెల్ని చదివించుకుంటున్నారు. అంతకుమించి ఆయనకు ప్రత్యేక ఆదాయవనరులు లేవు. పేద దళిత రైతు కాబట్టే.. ప్రభుత్వ పథకాలు కూడా ఆయనకు అందుతున్నాయి. దీన్నే… పెద్దగా చేసి.. ఆయన ఏదో సోనూసూద్‌ను మోసం చేసినట్లుగా.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విమర్శలు ప్రారంభించడంతో.. ఆయన మనస్థాపానికి గురయ్యారు.