కట్నం తాను తీసుకుని.. తనను మాత్రం స్నేహితుడికి అప్పగించేందుకు ఓ ఎన్నారై పెళ్లి చేసుకున్నాడంటూ… గుంటూరులో ఓ యువతి ఎస్పీని ఆశ్రయించింది. అమెరికాలో మంచి ఉద్యోగం అని చెబితే.. తల్లిదండ్రులు.. అర కోటి కట్నం.. 55 సవర్ల బంగారం ఇచ్చి పెళ్లి చేశారని.. ఆ తర్వాత… అతను సంసారానికి పనికి రాడని తేలిందని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తాను గేనని.. అమెరికాలో తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని.. నేరుగానే చెప్పాడని… తనను అమెరికా తీసుకెళ్తానని.. అక్కడ తన బాయ్ ఫ్రెండ్‌తో నువ్వు కూడా గడపవచ్చు.. తనకేం అభ్యంతరం లేదన్నాడని… యువతి చెబుతోంది. యువకుడి తల్లిదండ్రులకు చెబితే… కావాలంటే వేరే బాయ్ ఫ్రెండ్‌ని చూసుకోమని సలహా ఇచ్చారని.. కన్నీరుమున్నీరవుతోంది.
గుంటూరు ఏటీ అగ్రహారంలో నివాసం ఉండే యువతి తల్లిదండ్రులు.. ఎన్నారై సంబంధం అని తాహతుకు మించి ఖర్చు చేశారు. లాక్డౌన్ వేయడానికి కొద్ది రోజుల ముందే.. ఈ ఏడాది మార్చి 18న ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత రెండు నెలలు ఇండియాలో ఉన్న ఆ యువకుడు.. తన తీరుతో గొడవలు అవుతూండటంతో.. ప్రత్యేక విమానంలో టిక్కెట్ బుక్ చేసుకుని చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్లిపోయాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. తల్లిదండ్రులతో కలిసి గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
పోలీసులు .. అమెరికా వెళ్లిపోయిన పెళ్లి కుమారుడ్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. స్పందించి… తన వెర్షన్ ఏమిటో చెబితే సరి.. లేకపోతే.. తదుపరి చర్యలు తీసుకోవాలనే.. ఆలోచనలో పోలీసులు ఉన్నారు. అయితే.. అమెరికాలో ఉద్యోగం ఉందన్న కారణంగా.. ముందూ వెనుకా చూసుకోకుండా.. పెద్ద ఎత్తున కట్నాలిచ్చి.. తమ కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి ఇలాంటి ఘటనలు… కనువిప్పుగా మారుతూంటాయి.