ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు… మీడియా ఇంటర్యూల్లో వైఎస్ఆర్సీపీ అవినీతిపై నిరంతర పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే.. ఇళ్ల స్థలాల్లో అవినీతిపై బీజేపీ పోరాడిందని గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ముంపు భూములను.. ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. వైసీపీ నేతలే వాటిని తక్కువకు కొని ఎక్కువకు ప్రభుత్వానికి అమ్మారు. అయితే.. అధికార పార్టీ నేతల మధ్య తేడాలు రావడంతో.. ఆ విషయం ఒక్క సారిగా కలకలం రేపింది. ప్రతిపక్ష పార్టీలన్నీ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సోము వీర్రాజు కూడా.. బీజేపీ నేతగా… విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని… ప్రశ్నించారు. అదే అంశాన్ని.. తాను అవినీతికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంగా చెబుతున్నారు. ఇళ్ల స్థలాల అమ్మకాల్నీ వ్యతిరేకిస్తున్నామంటున్నారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత .. అనేక సమస్యలు.. రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. ఏ అంశంలోనూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగా లేదు. ఎప్పుడైనా ప్రెస్‌మీట్ పెట్టినా.. సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వాన్ని కాకుండా.. గత ప్రభుత్వాన్ని.., విమర్శిస్తూ ఉంటారు. దాంతో.. ఆయనపై.. వైసీపీ అనుకూల ముద్ర పడిపోయింది. బీజేపీలో.. రెండు వర్గాలు ఉన్నాయని.. ఒకటి వైసీపీ అనుకూలం.. మరోకటి టీడీపీ అనుకూలం అని చెబుతూ ఉంటారు. వైసీపీ అనుకూల బ్యాచ్‌కు.. సోము వీర్రాజును లీడర్‌గా చెబుతూ ఉంటారు. ఆయన మాటలు.. చేతలు కూడా.. ఇప్పటి వరకూ అంతే ఉన్నాయి. అయితే ఆయన నిన్నటి వరకూ బీజేపీ ఎమ్మెల్సీనే. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. కాబట్టి.. ఆయన ఏం మాట్లాడితే.. అదే బీజేపీ విధానం అవుతుంది.
ప్రతిపక్ష పార్టీగా.. అధికార పార్టీపై అలుపెరుగని పోరాటం చేస్తేనే… గుర్తింపు ఉంటుంది. లేకపోతే..అధికార పార్టీకి అనుబంధంగా మారిపోతుంది. ప్రస్తుతం.. జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తును సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సోము వీర్రాజుపై ఉంది. ఆయన కూడా అదే ఫీల్ అవుతున్నారు. పవన్‌తో వ్యక్తిగతంగా కూడా సోము వీర్రాజుకు సన్నిహిత సంబంధం ఉందన్న ప్రచారం ఉంది. జనసేనతో పొత్తును మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. సోము వీర్రాజు నియామకంపై వైసీపీ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం కావడంతో.. ఆయనపై మరింత ఒత్తిడి పెరిగింది. తన నియామకం.. వైసీపీ నేతల చలువ కాదని.. తనకు సొంత ఎజెండా ఉందని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.