వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల ఎదుట… ఆయన కుమార్తె సునీత హాజరయ్యారు. సునీత తన వద్ద ఉన్న ఆధారాలతో పాటు.. పలు ఫైళ్లను.. సీబీఐ అధికారులకు అందజేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా మూడు గంటల పాటు.. ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పులివెందుల నుంచి కడప సెంట్రల్ జైలు ప్రాంగణానికి విచారణ స్థలాన్ని మార్చిన అధికారులు… ప్రతీ చిన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆధారాలతో పాటు… ఇప్పటి వరకూ సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలును… సేకరించారు. టీంను 30 మందికి పెంచుకుని…. కేసుతో లింక్ ఉన్న ప్రతి విషయాన్ని కూపీ లాగుతున్నారు.
సునీత వేసిన పిటిషన్‌పైనే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ ప్రకారం.. ఆమె తన పిటిషన్లో 15 మంది అనుమానితుల్ని పేర్కొన్నారు. వారిపై ఎందుకు అనుమానం వ్యక్తం చేయాల్సి వచ్చిందో కూడా పిటిషన్లో పేర్కొన్నారు. వాచ్‌మన్ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ మనోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి , వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి , మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవిగా పిలిచే మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్లు ఉన్నాయి. వీరందరిపై తనకు ఉన్న అనుమానాలకు కారణాలు పిటిషన్లో పేర్కొంది. ఆ అనుమానాలకు ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
వివేకా కుమార్తె పిటిషన్ ఆధారంగా విచారణ జరుపుతున్నందున.. ఆమె అనుమానం వ్యక్తం చేసిన అందర్నీ సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను కూడా పిలిపిస్తారని అంటున్నారు. సీఐ శంకరయ్యను ఇప్పటికే విచారించారు. వరుసగా రెండు రోజుల పాటు విచారణ జరిగింది. వాచ్మెన్ రంగయ్యను కూడా ప్రశ్నించారు. త్వరలో సాక్ష్యాలు తుడిచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా నోటీసులిస్తారని అంటున్నారు. విచారణ జరుగుతున్న తీరుపై… ఒక్క విషయం కూడా బయటకు రాకుండా.. సీబీఐ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.