ఇటీవల విశాల్ కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. విశాల్ కి తన తండ్రి ద్వారా కోవిడ్ సోకింది. తన మేనేజర్‌కీ కరోనా పాజిటీవ్ అని తేలింది. దాంతో.. విశాల్ ఇంట్లోనే ఉంటూ.. చికిత్స తీసుకున్నాడు. కేవలం వారం రోజుల్లోనే కోలుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు విశాల్. “భయం లేకుండా ఉండడమే.. కోవిడ్‌కి అసలైన మందు. అంతా ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు. కోవిడ్ వచ్చిన వెంటనే.. మేం ఆసుపత్రుల వెంట పరుగెట్టలేదు. ఇంట్లోనే ఉంటూ హోమియోపతి, ఆయుర్వేద మందులు వాడాం. వాటితో త్వరగా ఉపశమనం దొరికింది. మా డాక్టర్ హరీష్ శంకర్ సలహాలూ, సూచనలు పాటించాం. సినిమాల గురించో, ఇతర విషయాల గురించో చాలా వీడియోలు పెట్టి ఉంటాను. కానీ.. ఈ సమయంలో ఇలాంటి ఓ వీడియో పోస్ట్ చేయడం నా ధర్మం. అలాగని నేను హోమియో, ఆయుర్వేద మందుల్ని ప్రచారం చేయడం లేదు. ఇది నా బాధ్యతగా భావిస్తున్నా“ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ఈ సమయంలో తాను ఎలాంటి మందులు వాడాడో.. ఓ లిస్టు ట్విట్టర్ లో పెట్టాడు. మొత్తానికి విశాల్ కరోనా నుంచి కోలుకున్నాడు. ఇది శుభవార్తే కదా!