జల జగడం విషయంలో.. కేంద్రం.. అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించాలని.. తేదీని ఖరారు చేయడం.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్లోనూ కలకలం రేపుతోంది. ఎందుకంటే… అటు తెలంగాణ కానీ.. ఇటు ఏపీ కానీ.. అపెక్స్ కమిటీ భేటీ ఐదో తేదీకి అమోదం తెలియచేయలేదు. రాష్ట్రాలతో సంబంధం లేకుండానే.. కేంద్రం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కమిటీ భేటీ ఏర్పాటు చేసేసింది. కేంద్రం ఎందుకు ఇంత దూకుడుగా ఉందని.. రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీల్లో ఈ అంశం కలకలం రేపుతోంది. ఎందుకంటే… అధికార పార్టీల మధ్య పరస్పర అవగాహనతోనే జల జగడాలు బయటకు వచ్చాయని.. ఇదో పొలిటికల్ గేమ్ ప్లాన్ అని ప్రచారం జరుగుతూండటమే దీనికి కారణం.
ఇటీవల హఠాత్తుగా.. ఏపీ సర్కార్… రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించడానికి జీవో జారీ చేసింది. ఈ జీవోపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఆ తర్వాత తెలంగాణ ఆ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఏపీ .. తెలంగాణలో కట్టిన అన్ని ప్రాజెక్టులు అక్రమమేనంటూ ఫిర్యాదు చేయడం జరిగిపోయాయి. ఇక తెలంగాణ కూడా.. ఏపీలో కట్టిన ప్రాజెక్టులు అక్రమమేనంటూ.. ఫిర్యాదు చేసింది. ఈ పరస్పర ఫిర్యాదులతో.. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులు… అన్ని ప్రాజెక్టుల డిపీఆర్లు సమర్పించాలని ఆదేశించాయి. కానీ రెండు రాష్ట్రాలు… తమవన్నీ పాత ప్రాజెక్టులే కాబట్టి.. డీపీఆర్లు సమర్పించలేమని చెబుతున్నాయి.
రెండు రాష్ట్రాలు నేరుగా.. కేంద్రానికే ఫిర్యాదులు చేసుకున్నాయి. అయితే.. రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంది. రాజకీయం కోసమే.. తమకు ఫిర్యాదులు చేస్తున్నారన్న అభిప్రాయం కేంద్ర పెద్దలకు వచ్చిందేమో కానీ.. వెంటనే.. ఆ సంగతేమిటో చూడాలని.. రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. గతంలో.., కేసీఆర్… కేంద్రం వద్దకు పంచాయతీకి పోయేది లేదని… జగన్ తో సఖ్యతగా నీటి వివాదాలు పరిష్కరించుకుంటామని… విజయవాడలోనే చెప్పారు. ఇప్పుడు… ఇద్దరి మధ్య అవే సంబంధాలు కొనసాగుతున్నా…జల వివాదాలు మాత్రం.. కేంద్రం కోర్టులోకి నెట్టారు. దీని వెనుక రాజకీయం ఉందని అనుకున్నారేమో కానీ.. అపెక్స్ కౌన్సిల్ భేటీలోనే అదేమిటో తేల్చాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు ఐదో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఈ సమావేశానికి హాజరవుతారా… అయితే.. ఏం చెబుతారు..? ప్రాజెక్టులపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.