తెలంగాణలో సెక్రటేరియట్ కూల్చివేతపై జరుగుతున్న రాజకీయ రగడ అంతా ఇంతా కాదు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అనూహ్యంగా బీజేపీ కూడా అలాంటి చారిత్రకమైన కట్టడాన్ని కూల్చివేస్తామని చెబుతోంది. ఆ చారిత్రక కట్టడం ఏదో కాదు.. పార్లమెంట్ భవనమే. ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని సుప్రీంకోర్టులోనే నేరుగా అఫడవిట్ దాఖలు చేసింది. పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని, భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం చెబుతోంది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 1937లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత అవసరాలకు సరిపోదని కేంద్రం చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం.. కొద్ది రోజుల కింట.. సెంట్రల్ విస్టా అనే ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని ప్రకారం.. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్క చోటకే వస్తాయి. ఢిల్లీలో వివిధ చోట్ల ఉన్న పాలనా కార్యాలయాలన్నీ.. ఒక్క చోటకు తెచ్చేలా.. ఓ కొత్త కార్యాలయ భవన సముదాయాల్ని నిర్మించాలని నిర్ణయించారు. సెంట్రల్ విస్టా పేరుతో ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. ఇందులోనే కొత్త పార్లమెంట్ భవనం కూడా ఉండనుంది. కొత్త పార్లమెంటు భవనాన్ని దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే 2022 ఆగస్టు 15నాటికల్లా అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం దేశం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా వృద్ధి రేటు మైనస్‌లోకి వెళ్లిపోతోంది. ఈ కారణంగా.. రూ. 20 వేల కోట్ల ఖర్చు అయ్యే సెంట్రల్ విస్టా లాంటి ప్రాజెక్టుల్ని నలిపివేయాలనే సూచనలు కేంద్రానికి వస్తున్నాయి. అయితే.. అలాంటి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి తీరుతామని ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌తోనే తేలిపోయింది.