ప్రణయ్ – అమృత ఎపిసోడ్ ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు రాంగోపాల్ వర్మ. తాను తీసిన `మర్డర్` కథకు ఆధారం ఈ పరువు హత్య కేసే! మారుతీరావు, అమృత, ప్రయణ్ పాత్రల చుట్టూనే ఈ `మర్డర్` తిరగబోతోంది. ఈ కథతో వర్మ ఏం చెప్పదలచుకున్నాడు? ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాడనే విషయాలు పక్కన పెడితే – ఇప్పుడిప్పుడే మానుతున్న ఓ గాయంపై వర్మ – మళ్లీ కారాలు పూసే పనిలో పడ్డాడన్నది మాత్రం వాస్తవం.
అయితే.. ఇది వర్మతో ఆగిపోవడం లేదు. సాయిపల్లవి కూడా తన వంతుగా గొంతు కలపబోతోంది. ఓ వెబ్ సిరీస్ లో సాయి పల్లవి నటించబోతోందిప్పుడు. వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇది కూడా పరువు హత్య నేపథ్యంలో సాగే కథే. వెట్రిమారన్ కథలన్నీ.. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందినవే. తను కూడా.. ప్రణయ్ – అమృతల కథని బాగా స్టడీ చేశాడట. దాని ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడని సమాచారం. మారుతీరావు పాత్రలో ప్రకాష్‌రాజ్ నటించబోతున్నాడు. వెట్రిమారన్.. వర్మలా కాదు. తన కథల్లో నిజాయతీ ఉంటుంది. పబ్లిసిటీ పిచ్చి ఉండదు. వర్మ సినిమాలో ఏం ఉన్నా, లేకపోయినా – వెట్రిమారన్ తీస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మాత్రం కొన్ని కఠిన నిజాలు తప్పకుండా ఎదురవుతాయి. మరి అవి ఎలాంటివో, అసలు అమృత గాథకీ, ఈ కథకూ ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.