కరోనా కాలం ఇది. ఆదాయాలు తగ్గిపోయాయి. అంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. సినిమా వాళ్లూ అంతే. బడ్జెట్లు తగ్గించుకుంటున్నారు. ఆ ఎఫెక్టు బుల్లి తెరపైనా పడింది. `బిగ్ బాస్` రియాలిటీ షోకు సైతం బడ్జెట్లు తగ్గించేశారు. త్వరలో `బిగ్ బాస్ 4` తెలుగు సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొంటున్న సెలబ్రెటీలకు ఇది వరకటితో పోలిస్తే… ఇప్పుడు పారితోషికం బాగా తగ్గించేశారని వినికిడి. ప్రైజ్ మనీలోనూ ఈ మార్పు కనిపించే ఛాన్సు వుంది.
అయితే నాగార్జున మాత్రం తన పారితోషికాన్ని ఏమాత్రం తగ్గించలేదు. గత సీజన్‌తో పోలిస్తే.. ఈసారి నాగ్ ఎక్కువగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ 3 సీజన్‌కీ నాగార్జునే హోస్ట్. ఆసీజన్ దాదాపు వంద రోజుల పాటు సాగింది. అయితే ఈసారి 50 రోజులకే ఈ సీజన్ పరిమితం చేయనున్నారు. నాగ్ పారితోషికం రోజు వారీ కిందే లెక్క. ఎపిసోడ్ కి ఇంత.. అని డిసైడ్ చేశారు. గతంలో కూడా ఇంతే. అయితే సీజన్ 3 సమయంలో నాగార్జునకి ఇచ్చిన పారితోషికంతో పోలిస్తే ఈసారి 25 శాతం ఎక్కువని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగ్ అడిగినంత ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే… ఈసారి హోస్ట్ కోసం చాలా అన్వేషణ సాగింది. కానీ స్టార్లెవరూ ఆసక్తి చూపించలేదు. దాంతో నాగార్జుననే మళ్లీ ఎంచుకోక తప్పలేదు. అందుకే నాగ్ ఎంత అడిగితే, అంత ఇచ్చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలోనూ, నాగ్ తన పారితోషికాన్ని ఈ రూపంలో పెంచుకోగలిగాడు.