హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఆ భేటీలో మోడి పరిపాలనపై కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాలు చెప్పారని, అనేక విషయాలపై సలహాలు, సూచనలు కూడా ఇచ్చారని చెబుతూ ఆంధ్రజ్యోతి ఇవాళ బ్యానర్ స్టోరీ ఇచ్చింది. ‘మీ మార్క్ ఏదీ!’ అంటూ ఇచ్చిన ఆ కథనంలో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు అంటూ అక్కడ జరిగిన సంభాషణను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాళ్ళు చెప్పినట్లుగా ఒక వెర్షన్ ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం… మోడీ గదిలోకి వెళ్ళిన వెంటనే, సీఎమ్ కేసీఆర్ ఆయనకు పుష్పగుఛ్ఛాన్ని అందించారు. వివిధ అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత మోడీ, “కేసీఆర్ గారూ, చెప్పండి ఏమిటి సంగతులు” అని అడిగారు. వెంటనే కేసీఆర్ సూటిగా… సుత్తి లేకుండా అసలు విషయానికొచ్చారు. “నేను ఓపెన్ మైండ్‌తో మాట్లాడితే మీకు నచ్చుతుందో, లేదో” అంటూ ఆగారు. ఏ విషయమైనా చెప్పండి అన్నట్లు మోడీ సైగ చేయగానే, మోడీ పాలనపై తన మనసులోని మాటను కేసీఆర్ బయటపెట్టారు.
పాలనపై మోడీ మార్క్ కనిపించటంలేదని, ఎస్సీ-ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వటంలేదని, ఎర్రకోట ప్రసంగాల్లో హామీలన్నీ గాలికొదిలేశారని, ఇప్పటికి రెండు బడ్జెట్లు పూర్తయినకూడా మోడీ మార్క్ ఉన్న స్కీమ్ ఒక్కటీ లేదని కేసీఆర్ నిష్కర్షగా చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. అన్ని రాష్ట్రాల ప్రజలూ ఎప్పటికీ గుర్తుంచుకునేలా కొన్ని శాశ్వత ప్రాజెక్టులను ప్రవేశపెట్టాలని సూచించారని రాసింది. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయాలని, అన్ని రాష్ట్రాల్లోనూ ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చినట్లు పేర్కొంది. మోడీ సానుకూలంగా స్పందించినట్లు రాసింది. కేసీఆర్ చెప్పిన విషయాలన్నింటినీ మోడీ ఒక నోట్ బుక్‌లో రాసుకున్నట్లుగా కూడా పేర్కొంది. తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని మోడీ అన్నట్లు రాసింది.
అయుత చండీ మహాయాగం దగ్గరనుంచి కేసీఆర్‌కు, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు మధ్య సత్సంబంధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ-కేసీఆర్ భేటీలో జరిగిన ఆంతరంగిక సంభాషణ విశేషాలు ఆంధ్రజ్యోతికి తెలిసే అవకాశం లేకపోలేదు.