నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలు బాగా చదువుకుంటేనే.. రేపటి భారతం విద్యాధికురాలు అవుతుంది. కానీ..,ప్రయోగాలతో.. అటూ ఇటూ కాకుండా పోతే.. మొత్తానికే తేడా వస్తుంది. ప్రస్తుతం.. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని మార్చేసింది. 34 ఏళ్ల వరకూ.. ఒకే విధానం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా మార్చేసింది. మామూలుగా అయితే… విద్యా సంవత్సరం ఈ పాటికి ప్రారంభమై ఉండేది. ఇలాంటి సందర్భంలో ప్రకటిస్తే.. గందరగోళం అయ్యేది. కానీ కరోనా కారణంగా ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు కాబట్టి… అమలు చేయడానికి కేంద్రానికి అవకాశం చిక్కింది.
కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం ప్రకటించింది. దీని ప్రకారం.. విద్యావ్యవస్థనే సమూలంగా మారిపోతోంది. ఇప్పటి వరకూ పదో తరగతి వరకు ఓ అంకం.. తర్వాత రెండేళ్ల ఇంటర్.. తర్వాత మూడేళ్ల డిగ్రీ విధానం ఉండేది. దీన్ని 10 + 2 + 3 గా పేర్కొంటూ వస్తున్నారు. ఇప్పుడు కేంద్రం 5 + 3 + 3 + 4 గా మార్చేసింది. మూడేళ్ల నుంచి పిల్లలను ప్లే స్కూల్‌కు పంపొచ్చు. 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ , 11-14 ఏళ్ల వారు మిడిల్ , 14-18 ఏళ్లవారు సెకెండరీ స్కూల్ విద్యను పొందుతారు. ఇందులో ఇంటర్మీడియట్‌కు చోటు లేదు. స్కూల్ విద్యలోనే దీన్ని కలిపేశారు. పరీక్షలకూ ప్రాధాన్యం తగ్గించేశారు. ఏటా ఒకసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. బట్టి పట్టడం వల్ల వచ్చే మార్కులను కాకుండా.. ప్రాక్టికాలిటీ ఆధారంగా గ్రేడింగ్ చేస్తారు.
చదువుకునే విధానంలోనే కాదు.. చదువుకునే సబ్జెక్టుల్లోనూ మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు సైన్స్ కు .. వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేస్తున్నారు. ఠశాల విద్య పూర్తిచేసుకొని బయటికెళ్లేనాటికి కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యమైనా విద్యార్థి సాధించేలా ఉంటుందని అంటున్నారు. ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న వారికి మూడేళ్ల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్లాలనుకున్నవారికి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి ఓ ఏడాది పీజీ కోర్సు ఉంటుంది. కేంద్రం ప్రకటించిన విధానం ప్రకారం… అందరికీ విద్య.. అందుబాటులో విద్య.. విద్యతో పాటు బతకడానికి కావాల్సిన నైపుణ్యం పెంచుకోవడం అనే కాన్సెప్ట్‌తో రూపొందిందని అనుకోవచ్చు.
కేంద్రం తెచ్చిన విద్యావిధానం.. మారుతున్న కాలానికి అనుగుణంగానే ఉంది. కానీ.. మాటలు చెప్పడం.. విధానాలను మార్చడం చాలా సులువు… పక్కాగా అమలు చేయడమే కీలకం. దేశం సమాఖ్య వ్యవస్థలో ఉంది. ఒక్కో ప్రభుత్వం ఒక్కోలా స్పందిస్తూ ఉంటుంది. రాజకీయంగా.. తమకు లభించే భావజాలాలను… పిల్లల మెదళ్లలో ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. తమ ఫోటోలను పాఠ్య పుస్తకాల మీదకు ఎక్కించుకునే పాలకులు కూడా.. ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి సమయంలో… కేంద్రం ముందు.. జాతీయ విద్యా విధానాన్ని పక్కాగా అమలు చేస్తేనే… భవిష్యత్ భారతానికి భరోసా అంటుంది. లేకపోతే… హఠాత్తుగా మీడియం మారిన స్కూల్ పిల్లవాడిలా అయిపోతుంది. అందుకే… ఎంతో జాగ్రత్త తీసుకుని పిల్లలకు చదువు చెప్పాల్సి ఉంది.