సోనూసూద్ ట్రాక్టర్ సాయం చేసిన మదనపల్లె రైతు నాగేశ్వరరావు.. చంద్రబాబు చేస్తానన్న సాయాన్ని తిరస్కరించారు. నాగేశ్వరరావు ఇద్దరు పిల్లల్లో ఒకరు ఇంటర్, మరొకరు డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి అరక దున్నుతున్న వీడియో వైరల్ అయిన సమయంలో.. చంద్రబాబు కూడా.. ఆ పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటానన్నారు. దాని ప్రకారం.. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆయన కుటుంబానికి లేఖ పంపారు. ఇద్దర్నీ.. గండిపేటలో ఉన్న ఎన్టీఆర్ మహిళా కాలేజీలో రెసిడెన్షియల్ సౌకర్యంతో ఉచితంగా చదివిస్తామని అలా ఇష్టం లేకపోతే.. వారి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని.. సమాచారం పంపారు. అయితే.. ఆ సాయం వద్దని నాగేశ్వరరావు చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే.. ఇప్పటికే.. ఏ రాజకీయ నేపధ్యం లేని సోనూసూద్ సాయం తీసుకున్నందుకే.. ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. ఇక నేరుగా.. చంద్రబాబు సాయం తీసుకుంటే… ఇంకెంతగా ప్రచారం చేస్తారని అనుకున్నారేమో కానీ.. ఆయన తిరస్కరించారు. ఏ రాజకీయ పార్టీ సాయాన్ని తాను తీసుకోనని చెప్పారు. నాగేశ్వరరావు… కాస్త చదువుకున్న వ్యక్తే. దళిత ప్రజా సంఘాల్లో పని చేస్తున్న వ్యక్తి. అందరిలాగే ఆయనకు రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి. అయినంత మాత్రాన.. సాయం తీసుకుంటేనే… ఆయనపై రకరకాల ప్రచారాలు చేయడంతో.. అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. చివరికి టీడీపీ సాయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సోనూసూద్ ఎక్కడ చూసి.. ఆ రైతుకు సాయం చేశారో కానీ.. మా మీడియాలో వచ్చింది చూసే.. ఇచ్చారంటూ.. అన్ని మీడియాలు క్లెయిమ్ చేసుకున్నాయి. అందులో సాక్షి కూడా ఉంది. అయితే.. అలా సాయం చేయడంతో.. ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకోలేదన్న ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఇది.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తుందని అనుకున్నారేమో కానీ.. ఆ రైతు పేదవాడు కాదనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక చంద్రబాబు సాయం తీసుకుంటే.. టీడీపీ ముద్ర వేసేయకుండా ఎలా ఉంటారు..? అందుకే.. సాయాన్ని నాగేశ్వరరావు వద్దనుకున్నారు.