సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. అన్ లాక్ 3లోనైనా.. థియేటర్లకు మోక్షం లభిస్తుందనుకుంటే.. ఆ ఆశలకూ, అంచనాలకూ కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. థియేటర్ల అనుమతికి ససేమీరా అనడంతో – నిర్మాతలు ప్రణాళికలన్నీ మళ్లీ తల్లక్రిందులయ్యాయి. ఆగస్టు నుంచి థియేటర్లు తెరిస్తే – దసరా నాటికి పరిస్థితి సర్దుకుని, కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడతాయని చిత్రసీమ భావించింది. ఇప్పటికే రెడీగా ఉన్న కొన్ని సినిమాల్ని దసరా బరిలో నిలపాలనుకున్నది. అయితే.. ప్రస్తుతం ఆ సూచనలేం కనిపించడం లేదు. థియేటర్లకు అన్ లాక్ 3లోనూ పర్మిషన్లు రాకపోవడంతో.. అన్ లాక్ 4 కోసం వేచి చూడడం తప్ప.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయగలిగిందేం లేదు.
సెప్టెంబరులో థియేటర్ల అనుమతి లభించిందనుకుందాం. అప్పటికప్పుడు సినిమాల్ని విడుదల చేయడం చాలా కష్టం. ముందు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి, థియేటర్ సిట్టింగ్ సిస్టమ్ మార్చుకోవాలి, టికెట్ల విక్రయం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరిగే ఏర్పాట్లు చేసుకోవాలి.. ఇలా చాలా తతంగమే ఉంది. పైగా.. పెద్ద సినిమాలేవీ, విడుదలకు రెడీ కాకపోవొచ్చు. ముందు చిన్న సినిమాలు వదిలి, పరిస్థితి గమనించే అవకాశం ఉంది. సెప్టెంబరు లో థియేటర్లకు పర్మిషన్లు ఇస్తారన్న గ్యారెంటీ ఇప్పటికీ లేదు. దానికి కారణం.. సినిమాలు, థియేటర్ వ్యవస్థని చిట్ట చివరి ప్రధాన్యతల లిస్టులో పెట్టింది కేంద్రం. స్కూల్లూ, కాలేజీలూ తెరిచిన తరవాతే.. థియేటర్ల గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం స్కూలు, కాలేజీలే తెరిచే అవకాశం లేదు. పైగా మాస్ గేదరింగ్ థియేటర్లలో ఎక్కువ. టికెట్ కౌంటర్లు, క్యూలూ, ఫుడ్ కాంప్లెక్స్‌ల దగ్గర వాళ్లని అదుపు చేయడం కష్టం. అందుకే.. థియేటర్ల గురించి కేంద్రం అసలు ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎలా చూసినా.. దసరానే కాదు, 2020 మొత్తం థియేటర్లకు తాళాలు వేసే అవకాశాలే ఎక్కువ. 2020 గురించి మర్చిపోయి 2021 సంక్రాంతి గురించి ప్లాన్ చేసుకోవడం తప్ప ఇప్పుడు చేయగలిగిందేం లేదు.