స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ ముగిసిపోతున్న చివరిక్షణంలో.. ఈ ఉత్తర్వులను పంచాయతీరాజ్ సెక్రటరీ.. గోపాలకృష్ణ ద్వివేదీ గవర్నర్ పేరిట విడుదల చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ గండం నుంచి ప్రభుత్వం బయటపడినట్లుగా అయింది. గత శుక్రవారం.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ సిఫార్సు చేసినా… నియమించకపోవడం ఏమిటని ఆశ్చర్యపోయింది. వారంలో నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలపై ప్రభుత్వం తాత్సారం చేసింది. ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అలాగని.. మరో ప్రత్యామ్నాయంమైనా ముందుకెళ్లలేదు. దీంతో… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందోనన్న చర్చ ప్రారంభమయింది.
అయితే అనూహ్యంగా ఈ విషయంలో తెగేదాకా లాగితే… ఆర్టికల్ 356 ప్రమాదం ఉందని.. వైసీపీ పెద్దలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగ, న్యాయనిపుణులు అదే చెప్పడంతో.. తప్పనిసరిగా.. అర్థరాత్రి పూట… నిమ్మగడ్డను నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చినట్లుగా సమాచారం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ.. స్థానిక ఎన్నికల నిర్వహణ చేపట్టారు. మొదట్లో.. ఆయన నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే.. కేంద్రం దేశంలో కరోనా ఎమర్జెన్సీ ప్రకటించడంతో.. ఆయన ఎన్నికలు వాయిదా వేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. దాంతో ఆయనపై విరుచుకుపడ్డారు. అప్పుడు ఆగిపోయిన స్థానిక ఎన్నికలు… కరోనా కారణంగా ఇప్పటి వరకూ జరగలేదు.
మధ్యలో ఎస్ఈసీని తొలగించేందుకు… జగన్మోహన్ రెడ్డి సర్కార్… అనూహ్యమైన అడుగులు వేసింది. ఆయన పదవీ కాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్‌లు తీసుకు వచ్చింది. రాత్రికి రాత్రి ఆయనను తొలగించింది. తమిళనాడుకు చెందిన కనగరాజ్‌ను ఎస్ఈసీగా నియమించింది. నిమ్మగడ్డ న్యాయపోరాటం చేయడంతో… చివరికి ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే… హైకోర్టు ఆర్డినెన్స్ కొట్టివేసినప్పుడే… ఆయనను మళ్లీ రీస్టోర్ చేసి ఉంటే.. ప్రభుత్వంపై విమర్శలు వచ్చేవి కావు. కానీ.. ఏకంగా.. అడ్వకేట్ జనరల్‌తో ప్రెస్‌మీట్ పెట్టించి.. విచిత్రమైన న్యాయసహాలు ఇప్పించి.. ఆయనను విధుల్లో చేరకుండా అడ్డుకున్నారు. దీంతో.. వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఈ ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని.. చట్టలాను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేసింది.
ఎంత చేసినా… సీఎం జగన్మోహన్ రెడ్డి… తాను అనుకున్నట్లుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్ఈసీ పదవిలోకి రాకుండా అడ్డుకోలేకపోయారు. నిమ్మగడ్డకు వచ్చే మార్చి వరకూ.. పదవి కాలం ఉంది. ఆ లోపు.. స్థానిక ఎన్నికలు జరిగితే.. ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. లేకపోతే.. జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించుకుని… పని పూర్తి చేసుకోవచ్చు.