” వర్షాకాలంలో పడే వర్షాలకు కూడా కారణం మేమే”మని క్రెడిట్ తీసుకునే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి. నిజంగా ఆ రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఏం చేస్తాయో.. చేశాయో.. చేయబోతున్నాయో చెప్పుకుంటాయో లేదో కానీ.. ఇలా ప్రకృతి సిద్ధంగానో… సహజంగానే జరిగిపోయే వాటికి.. తామే కారణం అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కో సారి.. ఇలాంటి వాటి కోసం.. ప్రత్యేకంగా స్కిట్స్ ప్రదర్శిస్తూ ఉంటారు. కరోనా విషయంలో.. మొదట్లో ఇవే స్కిట్స్‌ను ప్రదర్శించా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకరికి మించి ఒకరు.. డ్రామాలతో హోరెత్తించారు. కానీ చివరికి అది కంట్రోల్ అయ్యేది కాదని గుర్తించి.. ఇప్పుడు.. ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. ప్రజల్ని కరోనాకు వదిలేశారు.
కరోనాను సైడ్ చేసి.. రాఫెల్.. రామాలయం వైపు రాజకీయం మళ్లిస్తున్న మోడీ..!
మార్చి నెలలో ఏం జరిగిందో … ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి. అక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెరపైకి వచ్చారు. రాత్రి ఎనిమిది గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించేవారు. మొదటగా.. జనతా కర్ఫ్యూ అన్నారు. వైరస్‌ను చంపేయడమే మిగిలిందన్నారు. తర్వాత తొలి విడత లాక్ డౌన్… మధ్యలో.. తప్పట్లు.. తాళాలు.. పూలవర్షాలు కూడా కురిశాయి. ఎప్పుడు ప్రసంగించినా.. ఇదిగో గెలవబోతున్నాం.. వైరస్ చైన్‌ను తెంపేస్తున్నామని ప్రకటనలే. ఆ లాక్ డౌన్లు అలా పెరుగుతూ పోయాయి కానీ.. వైరస్ చైన్ అయితే.. ఎక్కడా తెగలేదు. ఇంకా పెన వేసుకుంటూ పోతోంది. ఇప్పుడు అన్ లాక్ అనేది… ప్రజల్ని పూర్తిగా కరోనాకు వదిలేశారు. ప్రధాని మోడీ కూడా ఇప్పుడు కరోనా గురించి మాట్లాడటం లేదు. ఒకప్పుడు .. కరోనా కట్టడి విషయంలో ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోందని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. ఇప్పుడు మోడీ గారి ప్రయారిటీ.. నిన్నటి వరకూ.., రాఫెల్ యుద్ధ విమానాలు.. రేపటి నుంచి రామమందిరం. దేశానికి ఇంతకు ముందు యుద్ధ విమానాలు లేనట్లుగా… ఓ ఐదు యుద్ధ విమానాలు.. ఫ్రాన్స్ నుంచి తీసుకొస్తూ.. చేసిన షో అంతా ఇంతా కాదు. ఇక చైనా పీచమణచడమే తరువాయని… వంధిమాగధులతో బాకా ఊదించుకున్నారు. కానీ అందులో నిజాలేంటో.. ఆ పబ్లిసిటీ వెనుక పరమార్థం ఏమిటో రాజకీయం అర్థం అయిన వారికి సులువుగానే అవగాహనకు వస్తుంది. ఇక రేపట్నుంచి.. రామ మందిరం గురించి షో ప్రారంభమవుతుంది. ఐదో తేదీ వరకూ.. అది పీక్స్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. కానీ.. కరోనా మాత్రం రాదు. కరోనా.. ఇప్పుడు.. ఓ అన్ వాంటెడ్ సబ్జెక్ట్. ఎందుకంటే.. దానిపై గెలవలేమని ప్రభుత్వానికి క్లారిటీ వచ్చింది. ఓడిపోయామని ప్రజలకు గుర్తు రాకూడదు. అందుకే… కొత్త కొత్త భావోద్వేగాల కథలు..!
కరోనాను ఖతం చేస్తామన్న కేసీఆర్ సచివాయం.. జల వివాదాల ఎజెండాతో డైవర్షన్..!
కరోనాపై కత్తి దూసి.. ప్రజల్ని కాపాడేస్తున్నామని కోతలు కోసి.. ఇప్పుడు.. అసలు పట్టించుకోని బాపతు ప్రభుత్వాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రముఖంగా ఉంటాయి. ఒక్క సారి రివైండ్ చేసుకుని మార్చి నెలకు వెళ్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వీర స్టేట్మెంట్లు గుర్తుకు వస్తాయి. తెలంగాణలో కరోనానే లేదు అనే దగ్గర్నుంచి వైరస్‌ను.. బద్దలు కొట్టేస్తాం అనే వరకూ.. చాలా చాలా మాటలు మాట్లాడారు. ఆయన ఓ శాస్త్రవేత్తగా మారిపోయి.. ఇండియా ఉష్ణోగ్రతల్లో అసలు కరోనా పెరిగే చాన్సే లేదని తీర్మానించారు. మాస్క్ అడిగిన వాళ్లను.. పిచ్చోళ్లుగా వెటకారం చేశారు. ఆ తర్వాత.. కరోనా లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత… ఇక కరోనా అంతమేనని గర్జించారు. వారానికోసారి ప్రెస్మీట్లు పెట్టి.. ప్రజలకు తానున్నన్నట్లుగా ఫోజులిచ్చారు. ఆయన మాటలు చూసి.. మాకేముంది.. కేసీఆర్ ఉన్నారని అందరూ అనుకున్నారు. తీరా.. దానంతటకు ఆ కరోనా పోలేదు. ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది. అయితే… కేసీఆర్ మాత్రం అందరి కంటే ముందుగానే.. అది వదలదని.. వదిలించిన క్రెడిట్ కూడా దక్కదని ఫిక్సయిపోయి… సచివాలయం కూల్చివేత.. కొత్త సచివాలయం కట్టుడు అంటూ.. కొత్త ఎమోషన్ ప్రారంభించారు. త్వరలో.. ఆంధ్రప్రదేశ్‌తో జల జగడాన్ని తెరపైకి తెస్తున్నారు. ఐదో తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా… ” ఇద్దరు మిత్రులు” కరోనాను మర్చిపోయే కొత్త కథను తెరపైకి తేబోతున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
కరోనా అందరికీ వస్తుందంటూ.. ప్రజల్ని వైరస్‌కు వదిలేసిన జగన్..!
ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కి కరోనా అంటే పిచ్చి కోపం. అందుకే దాన్ని ఆయన మొదటి నుంచి లైట్ తీసుకున్నారు. కేసీఆర్ బాటలోనే పారసిటమాల్ మాత్రమే దానికి వైద్యం అని చెప్పి ప్రారంభించి.. భవిష్యత్‌లో కరోనా రాని వాళ్లంటూ ఎవరూ ఉండరని.. తేల్చేశారు. దానికి తగ్గట్లుగాన ఏపీలో ప్రజలు పిట్టలు రాలిపోతున్నట్లు రాలిపోతున్నారు. రోజుకు.. 60, 70 మరణాలు కోవిడ్ ఖాతాలో చూపిస్తున్నప్పటికీ… అంతకు మించి ఉంటాయనే భావన అందరిలోనూ ఉంది. నమోదవుతున్న పాజిటివ్ కేసులు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నమోదు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్యపు ప్రకటనలు.. ఆయన పార్టీ నేతలు చేసిన.. హడావుడి.. కోవిడ్‌కు తాము అతీతం అనుకుంటూ… చేపట్టిన కార్యక్రమాలు.. ప్రజల పీకల మీదకు తెచ్చాయి. చావులకు పది మంది.. పెళ్లిళ్లకు ఇరవై మందికి మాత్రమే పర్మిషన్ అంటూ హడావుడి చేసే ఏపీ సర్కార్… మద్యం దుకాణాల వద్ద మాత్రం.. ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. పైగా సమయం పెంచి.. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కరోనా అందరికీ వస్తుందంటూ.. అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా .. సీఎం వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి కుటుంబాలకు దిక్కెవరో మాత్రం.. చెప్పడం లేదు.
కరోనాను గెలవలేక ఇతర భావోద్వేగాలు రెచ్చగొడుతున్న పార్టీలు..!
కేంద్ర ప్రభుత్వం, ఏపీ సర్కార్.. తెలంగాణ సర్కార్.. అన్నీ.. కరోనా ఇలా వచ్చి అలా పోతుంది.. తాము.. దాన్ని తరిమేసిన ఇమేజ్ ను.. పొందాలన్న ఆతృతతో లాక్ డౌన్ డ్రామా ఆడారు. కానీ.. కరోనా మన రాజకీయ నాయకులకు మించిన వైరస్. అందుకే.. లాక్ డౌన్ వేసినా.. అన్ లాక్ చేసినా… దాని పని అది చేసుకుంటూనే పోతోంది. తనను కట్టడి చేసే చాన్స్ రాజకీయ నాయకులు ఇవ్వలేదు. ఈ విషయం వారికి బాగానే అర్థమయింది. అందుకే.. కరోనాను పక్కకు నెట్టేసే ప్లాన్లలో ఉన్నారు. అది ఎంత మంది ప్రాణాలు తీసినా.. ఆర్థిక వ్యవస్థను ఎంతగా కుంగదీసినా.. కొన్ని కోట్ల ఉద్యోగాలను మాయం చేసినా… రోజు కూలీలు.. పూట గడవడానికి ఇబ్బంది పడుతున్నా.. పట్టించుకోరు. రామ మందిరం… జల వివాదాలు.. కొత్త సచివాయం పేరుతో సరికొత్త డ్రామాలు సృష్టించి.. అసలు సమస్యను పక్కదారి పట్టిస్తారు. ఇప్పటికే ఇవి స్టార్టయ్యాయి.. ముందు ముందు.. మరింత పీక్స్‌కు చేరనున్నాయి.
తామేం కోల్పోతున్నామో గుర్తించలేని ప్రజలున్నంత కాలం మార్పురాదు..!
ప్రభుత్వాల కనీస బాధ్యత.. ప్రజారోగ్యాన్ని కాపాడం. ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశాల దగ్గర్నుంచి ఉగాండా లాంటి ఆఫ్రికా దేశం వరకూ.. అన్ని దేశాల ప్రభుత్వాలు… తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు నిజాయితీగా ప్రయత్నించాయి. కరోనాను కట్టడి చేసి ఫలితాలు సాధించాయి. కానీ.. ఒక్క మన దేశంలో మాత్రమే… అది అంతమవక ముందే.. అంతం చేసేసినట్లేనని సంబరాలు చేసుకున్నాం. కరోనాను తరిమికొట్టిన వీరుడు.. శూరుడు అని పొడిగేసుకుంది. కరోనాకు వ్యాక్సిన్ మానేతేనన్న డైలాగులూ విన్నాం.. కానీ ఇప్పుడు.. ప్రజలు బలైపోతున్నా.. కుటుంబాలు అనాథలవుతున్నా… పట్టించుకునే నాథుడే లేడు. అందుకే.. రాజకీయం అంటే… ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే. వారు చనిపోతున్నా.. వారిని మరో ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి.. తమ పబ్బం గడుపుకోవడమే రాజకీయం. ఇప్పుడు ఇండియాలో అదే జరుగుతోంది. ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సాటి మనుషులే పట్టించుకోరు.. ఇక ఆ మనుషుల్లోనే మరో రకం అయిన.. రాజకీయ నేతలు పట్టించుకుంటారా..? . తాము ఏం కోల్పోతున్నామో ప్రజలు తెలుసుకోనంత వరకూ.. ఈ దేశంలో మార్పు రానే రాదు.