” బేసిన్లు లేవు.. బేషజాలు లేవు. మా వివాదాలు మేమే పరిష్కరించకుంటాం. ట్రైబ్యునళ్లు.. కేంద్రం పంచాయతీలు అవసరం లేదని” విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిధిగా వచ్చి కేసీఆర్ తనదైన స్టైల్లో చెప్పారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడుతున్న జల వివాదాల పాపాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారు. కేంద్ర జల శక్తి శాఖ తీరు హాస్యస్పదంగా ఉంటోంది.. కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు… తక్షణం సమస్యలు పరిష్కరించాల్సింది పోయి… నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుందోని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రతో వివాదాలను ఆయన స్వయంగా అక్కడి సీఎంతో మాట్లాడి పరిష్కారం చేసుకున్నారు. ఏపీ సీఎంకు .. ఇంటా బయటా సహకారం అందించి మంచి స్నేహం చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే .. అన్ని సమస్యలూ పరిష్కరించుకుంటామన్నారు. కానీ.. ఇప్పుడు ఎక్కడ తేడా కొట్టిందో… జల వివాదాలు ఉంటేనే.. తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయం ఉంటుందని అనుకున్నారో కానీ.. కేంద్రం పరిష్కరించలేదనే మాటలను చెబుతున్నారు.
కొద్ది రోజులుగా.. తెలుగు రాష్ట్రాల మధ్య అక్రమ ప్రాజెక్టుల పంచాయతీ నడుస్తోంది. ఒకరి ప్రాజెక్టులు అక్రమం అని.. మరొకరు.. పరస్పరం… ఆయా నదీ బోర్డులకు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే.. ఎవరూ.. తమ ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించలేదు. విభజన చట్టం ప్రకారం.. అపెక్స్ కౌన్సిల్ భేటీలో అంగీకారం లభిస్తేనే.. కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి. కానీ ఎవరికి వారు పాత ప్రాజెక్టులేనంటూ.. కొత్త ప్రాజెక్టులు కట్టేస్తున్నారు. ఈ వివాదాన్ని తమ మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఉపయోగించుకుని పరిష్కరించుకోవడం లేదు జగన్ – కేసీఆర్. వరుసగా ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకుంటూండటంతో.. కేంద్రం ఇప్పుడు.. స్వయంగా రంగంలోకి తిగి… నేరుగా అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది.
జల వివాదాలను జగన్ – కేసీఆర్ సామరస్యంగా పరిష్కరించుకోగలరని.. కానీ.. రాజకీయం కోసం.. ఇద్దరు ముఖ్యమంత్రులు.. కొత్తగా గేమ్ మొదలు పెట్టారన్న ఆరోపణలు.. అటు తెలంగాణలో.. ఇటు ఏపీలో విపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఎందుకంటే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమం అని ఇప్పుడు ఏపీ సర్కార్ అంటున్నా.. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి స్వయంగా ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయన పేరు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద.. పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ.. మొత్తం వివాదాలు పరిష్కరించలేదని… నిందను కేంద్రంపై వేసేస్తున్నారు కేసీఆర్..!