చిరు 152వ చిత్రం `ఆచార్య`. అన్నీ సజావుగా సాగితే.. ఈపాటికి సినిమా పూర్తయ్యేది. కానీ కరోనా వల్ల ఆగిపోయింది. లాక్ డౌన్ నిబంధనల్ని సడలించిన తరవాత.. షూటింగులుకు అనుమతి ఇచ్చాక.. `ఆచార్య`ని పట్టాలెక్కిద్దాం అనుకున్నారు. కానీ.. కుదర్లేదు. మళ్లీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదు. అయితే.. ఆచార్య షూటింగ్ ఎక్కడి వరకూ జరిగింది? ఎక్కడ ఆగింది? అనే విషయాలపై మాత్రం ఇప్పుడు స్పష్టత వచ్చింది.
ఆచార్య కోసం ఇప్పటి వరకూ మూడు ఫైట్స్ పూర్తి చేశారు. ఈ మూడు ఫైట్స్‌కీ రామ్ – లక్ష్మణ్ మాస్టర్లు తెరకెక్కించారు. ఇంట్రవెల్ బ్యాంగ్ తెరకెక్కిస్తున్నప్పుడు.. కరోనా వల్ల షూటింగ్ ఆపేశారు. దాదాపు 30 శాతం టాకీ పూర్తయింది. ఓ పాట కూడా తెరకెక్కించారని తెలుస్తోంది. `ఆచార్య` షూటింగ్ ఎప్పుడు మొదలెట్టినా.. మధ్యలో ఆపేసిన ఇంట్రవెల్ ఫైట్ దగ్గర నుంచే శ్రీకారం చుట్టబోతున్నార్ట. వాక్సిన్ వచ్చేంత వరకూ.. అగ్ర హీరోలు సెట్స్‌పైకి వెళ్లే ధైర్యం చేయరు. సో.. ఆచార్య మళ్లీ పట్టాలెక్కాలంటే… వాక్సిన్ కోసం ఎదురు చూడడం తప్ప, మరో మార్గం లేనట్టే.