నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి నియమిస్తూ ఎట్టకేలకు ఏపీ సర్కార్ గవర్నర్ పేరిట ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఐదు నెలల పాటు సాగిన వివాదానికి తెరపడినట్లయింది. ఇప్పుడు.. అందరిలోనూ.. ఒకటే సందేహం వస్తోంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలు. మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు.. ఎక్కడ ఆగాయో.. అక్కడి నుంచే కొనసాగిస్తారా లేక.. ప్రక్రియ మొత్తం రద్దు చేసి..మళ్లీ కొనసాగిస్తారా.. అనేది రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలకు కారణం అయింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మళ్లీ ఎస్ఈసీ కాకూడదని ప్రభుత్వం న్యాయవ్యవస్థను సైతం ధిక్కరించడానికి సిద్ధపడటానికి కారణం.. మళ్లీ నిమ్మగడ్డ వస్తే.. ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియను రద్దు చేస్తారనేనని భావించడమే నంటున్నారు. అందుకే.. నిమ్మగడ్డ ఏం చేస్తారోనన్న ఆందోళన అధికారపక్షంలోనూ ఉంది.
కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందా..?
కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించడంతో.. మార్చి పదిహేనో తేదీన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికలు వాయిదా పడినప్పటికీ.. కోడ్ మాత్రం అమల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. జగన్‌కు ఈ నిర్ణయం నచ్చకపోవడంతో.. మొదట గవర్నర్‌కు ఫిర్యాదు చేసి.. తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు., కోడ్ ఎత్తిన సుప్రీంకోర్టు వాయిదా నిర్ణయాన్ని మాత్రం.. సమర్థించింది. అప్పటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల వరకు మాత్రమే వచ్చింది. ఇప్పటికి ఐదు నెలలు దాటిపోయింది. మరి కొన్ని నెలల పాటు.. ఆ ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
కనగరాజ్ ఉత్తర్వులు చెల్లవు.. ఇప్పుడు రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సిందే..!
రమష్ కుమార్ మొదట ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరు వారాలు ముగిసేలోపే నిమ్మగడ్డను.. ప్రభుత్వం తొలగించింది. అప్పటికి .. కనగరాజ్ ఎస్ఈసీగా ఉన్నారు. ఆయన పేరుతో.. వాయిదా కొనసాగిస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చారు. ఎంత కాలం అని చెప్పలేదు. కరోనా ఇప్పటికీ సద్దుమణగలేదు. కనగరాజ్ నియామకమే చెల్లదు కాబట్టి.. ఆయన ఇచ్చిన ఉత్తర్వులు కూడా చెల్లవు. దీంతో… రమేష్ కుమార్.., పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సమీక్షించి.. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సోమవారం.. రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయవర్గాలకు ఆసక్తికరంగా మరింది.
ఏకగ్రీవాలపై అనుమానాలతో కేంద్రానికి లేఖ రాసిన నిమ్మగడ్డ ..!
రమేష్ కుమార్ మార్చి 15వ తేదీన ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. అప్పటికే ఏకగ్రీవమైన స్థానాల అభ్యర్థులు మిగతా వారితో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో జరిగిన దాడులు, అక్రమాలపై ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు, పలువురు డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రమేష్ కుమార్ ఆదేశాలు ప్రభుత్వం పాటించలేదు. ఎన్నికల్లో జరిగిన పరిణామాలను వివరిస్తూ.., ఏకగ్రీవాలు అన్నీ అనుమానాస్పదమేనని తర్వాత కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారయంత్రాంగం సహకరించలేదని.. తప్పుడు నివేదికలు ఇచ్చారని… అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు అయ్యాయని కేంద్రానికి లేఖ రాశారు.
ప్రక్రియ రద్దు చేసి.. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తారా..?
ఎన్నికల ప్రక్రియం మొత్తం 21 రోజుల్లో పూర్తయ్యేలా ఓ ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన ప్రభుత్వం.. దాని ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. కానీ ఇప్పుడు దాని ప్రకారం.. 21 రోజులు దాటిపోయినందున సాంకేతికంగా కూడా ఎన్నికల ప్రక్రియ చెల్లదు. ఎన్నికల ప్రక్రియను ఎక్కడ ఆపేశారో.. అక్కడి నుంచే కొనసాగించాలో లేదో.. పూర్తిగా ఎన్నికల సంఘం విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా..న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఎస్ఈసీ విధి నిర్వణ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు కూడా స్పష్టత ఇచ్చింది. అంటే.. ఇప్పుడు బంతి ఎస్ఈసీ పరిధిలోనే ఉంది. నిమ్మగడ్డ గతంలో కేంద్రానికి రాసిన లేఖ ప్రకారం.. ప్రక్రియ రద్దు చేసి.. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించే నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని భావిస్తున్నారు.