ఐదో తేదీన జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ భేటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలో జరగనున్న ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ తప్పనిసరిగా హాజరు కావాలని.. కేంద్రం నుంచి స్పష్టమైన సమాచారం అందింది. వారిద్దరూ హాజరైతేనే.. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగుతుంది. ఒక్కరు హాజరు కాకపోయినా… వాయిదా పడుతుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం… అపెక్స్ కౌన్సిల్ భేటీకి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారుల వద్ద నుంచి సేకరించి.. అధ్యయనం చేస్తున్నారు.
మరో వైపు కేసీఆర్ మాత్రం.. అపెక్స్ కౌన్సిల్ భేటీకి దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే 20వ తేదీకి భేటీని వాయిదా వేయాలని లేఖ రాసిన కేసీఆర్.. అదే రోజు.. మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అపెక్స్ భేటీకి డుమ్మాకొట్టేందుకే.. అదే రోజున కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారన్న అభిప్రాయం.. ఆంధ్రప్రదేశ్ అధికావర్గాల్లో ఏర్పడింది. కేసీఆర్… అపెక్స్ కమిటీ భేటీ వాయిదా కోరారన్న సమారాన్ని అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. అయితే.. జగన్ మాత్రం… భేటీ జరుగుతుందన్న నమ్మకంతోనే ఉన్నారు. అందుకే అన్ని విధాలుగా సిద్ధం కావాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి 800 అడుగుల నుంచి నీరు తీసుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం.. శ్రీశైలంలో నీరు 854 అడుగులకు చేరితేనే పోతిరెడ్డి పాడు ద్వారా నీరు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. అయితే.. తెలంగాణ మాత్రం.. 800 అడుగుల నుంచే నీరు తీసుకుంటోంది. ప్రస్తుతం.. శ్రీశైలంలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వాడుసుకుంటోంది. తెలంగాణ 800 అడుగుల నుంచి వాడుకుంటున్నప్పుడు.. తామెందుకు వాడుకోకూడదన్నది జగన్ ఆలోచన. దీన్నే అపెక్స్ కమిటీలో ప్రస్తావించి.. రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతులు పొందాలని భావిస్తున్నారు.
అయితే.. కేసీఆర్ మాత్రం వాయిదాలు కోరుతూండటం… అపెక్స్ భేటీకి అంత సానుకూలంగా లేకపోవడం… ఏపీ ప్రభుత్వానికి మరింత బలం ఇచ్చినట్లుయింది. ఏపీ సర్కార్ వాదనను.. వ్యతిరేకించలేరని… అలాగే శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే నీరు తీసుకుంటున్నట్లుగా ఒప్పుకోవాల్సి వస్తుందని.. అందుకే.. తెలంగాణ వాయిదా కోరుతుందని అంటున్నారు. ఒక వేళ అపెక్స్ కౌన్సిల్ భేటీ కేసీఆర్ రాకపోవడం వల్ల వాయిదా పడితే.. ఎత్తిపోతల టెండర్లను ఖరారు చేయాలనే ఆలోచన… జగన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.