ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు పెడుతున్న ఏపీ ప్రభుత్వం నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని నిర్ణియంచుకున్నట్లు కనిపిస్తోంది. జోన్లుగా విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ప్రకటిస్తారు. వాటి పరిధిలో కొన్ని జిల్లాలను ఉంచుతారు. వాటన్నింటికీ ప్రత్యేకంగా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేస్తారు. బోర్డు పరిధిలో చైర్మన్‌తో పాటూ ఏడుగురు సభ్యులు ఉంటారని.. చైర్మన్‌కు కేబినెట్ హోదా ఉంటుందని చెబుతున్నారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు ఈ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే సీఆర్డీఏను రద్దు చేసిన ప్రభుత్వం…ఏఎంఆర్డీఏ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నాలుగు జీవోలు జారీ అయినా… వాటిని కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుంది.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే… మిగతా జిల్లాల్లో మాకేమిటి అన్న చర్చ వస్తుందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా రాయలసీమకు హైకోర్టుతో ఒరిగేమీ లేదనే భావన అంతకంతకూ పెరుగుతోంది. ఇక కోస్తా ప్రాంతంలో రాజధాని తరలింపుతో సహజంగానే అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికే రైల్వే జోన్ ను విజయవాడకు తరలించాలన్న చర్చ కూడా నడుస్తోంది. వాస్తవానికి విజయవాడ రైల్వే జోన్ అయితే కరెక్ట్‌గా ఉంటుందని నివేదికలు కూడా ఉన్నాయి. కానీ అప్పట్లో… రాజధాని అమరావతిలో పెడుతున్నారు కాబట్టి.. విశాఖకు రైల్వే జోన్ ఉండాలని ప్రభుత్వం పట్టుబట్టింది. ఇప్పుడు వీటన్నింటినీ కవర్ చేయాలంటే.. అన్ని ప్రాంతాలకు ప్రత్యేకంగా అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు ఏపీ ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తు కూడా పూర్తయిందని.. ఏ క్షణమైనా ప్రకటిస్తారని అంటున్నారు. ఈ బోర్డులకు నామినేటెడ్ పదవులు ఉంటాయి కాబట్టి… ఆయన ప్రాంతాలకు కూడా పదవులు ఇచ్చినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రజల సెంటిమెంట్లతో ముడిపడిన అంశం కావడంతో.. ఈ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసిన తరవాత రాజధానుల్ని తరలించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలో వైఎస్ హయాంలోనూ ఇలాంటి అభివృద్ధి కమిటీలు. వేశారు. కానీ.. వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందేమీ లేదు. ఆ కారణంగా అవన్నీ పదవుల కోసమే అన్నట్లుగా ఉండిపోయాయి. ఇప్పుడు ఏపీలో నియమించబోతున్న కమిటీలు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఖర్చు పెడుతున్నదేమీ లేదు మరి..!