హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో శుక్రవారమే తాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా బాధ్యతలు స్వీకరించానని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. సుప్రీంకోర్టు హెచ్చరికలతో.. గత గురువారం అర్థరాత్రి.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను మళ్లీ ఎస్ఈసీగా నియమిస్తున్నట్లుగా ఉత్తర్వలు జారీ చేసింది. దాంతో ఆయన సోమవారం.. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల సంఘం కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
ప్రభుత్వం ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించానని …విధుల్లో ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని..రాగద్వేషాలకు అతీతంగా పనిచేసే వ్యవస్థ అని స్పష్టం చేశారు. ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియజేశామన్నారు. ఎన్నికల సంఘం సిబ్బందితో నిమ్మగడ్డ సమీక్షలు నిర్వహించనున్నారు. గతంలో ఆయనను తొలగించక ముందు ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేశారు.
అయితే.. ఆరు వారాలు పూర్తయ్యేసరికి.. ఆయనను ప్రభుత్వం తొలగించింది. కనగరాజ్ ను నియమించింది. ఆయన కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయన నియామకం చెల్లదు కాబట్టి.. ఇప్పుడు.. ఎన్నికల వాయిదాపై కొత్తగా నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.