రవితేజ… ఈ హీరో హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. `రాజా ది గ్రేట్` తరవాత.. రవితేజకి అన్నీ ఫ్లాపులే. అలాంటిలాంటి ఫ్లాపులు కాదు. వరుసగా డిజాస్టర్లు. మామూలుగా అయితే.. ఇన్ని ఫ్లాపులు మరెవరికైనా వస్తే కెరీర్ ఖల్లాస్ అయ్యేది. అటు వైపు దర్శక నిర్మాతలు కన్నెత్తి కూడా చూసేవాళ్లు కాదు. కానీ…. రవితేజ విషయంలో అలా జరగలేదు. ఇప్పుడు మాస్ రాజా చేతిలో ఏకంగా 5 ప్రాజెక్టులున్నాయి. క్రాక్ విడుదలకు సిద్ధంగా ఉంది. నక్కిన త్రినాథరావు తో ఓ సినిమా చేయాలి. రమేష్ వర్మ కథ రెడీ చేసుకున్నాడు. వక్కంతం వంశీ ప్రాజెక్టు ఓకే అయ్యింది. ఇది కాకుండా మరో రీమేక్ రెడీ అవుతోంది.
ఏక కాలంలో ఇన్ని సినిమాలు ఓకే చేసుకున్న హీరో రవితేజనే. అందులోనూ.. వరుస ఫ్లాపుల మధ్య. అలాగని రవితేజ పారితోషికం ఏమీ తగ్గించలేదు. రిబేట్లూ ఇవ్వలేదు. కానీ.. దర్శకులంతా రవితేజనే కావాలంటున్నారు. దానికి కారణం.. రవితేజ టైమ్ సెన్స్. సినిమాని చాలా త్వరగా పూర్తి చేయగలడు రవితేజ. పైగా రవితేజ సినిమా అంటే హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌కి కొదవ ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా.. మిగిలిన హీరోలంతా ఇప్పుడు బిజీ. స్టార్ హీరోలెవరూ దర్శక నిర్మాతలకు అందుబాటులో లేరు. అర్జెంటుగా ఓ సినిమా తీసేద్దాం.. అనుకున్నవాళ్లందరికీ రెడీమెడ్ గా దొరికే హీరో రవితేజనే. డైరెక్టర్లూ, ప్రొడ్యూసర్లతో రవితేజ పెట్టుకునే ఎటాచ్‌మెంట్ వేరుగా ఉంటుంది. ఫ్లాపులలో ఉన్న దర్శకుడైనా సరే – కథ చెబుతానంటే రెడీగా ఉంటాడు. ఎన్ని విధాల చూసినా.. రవితేజ కంఫర్ట్ అని దర్శకుల అభిప్రాయం. అందుకే.. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా, రవితేజ సినిమాల్ని సంపాదించుకోగలుగుతున్నాడు.