ఆంధ్రప్రదేశ్ కోవిడ్ సెంటర్లలో రోగులకు ప్రపంచంలో ఎక్కడా చేయనన్ని సేవలు అందిస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వైసీపీ నేతలకు మాత్రం.. అలా అనిపించడం లేదు. ఎవరికి చెప్పుకుందామా.. అని చూసి చూసి.. చివరికి ఎవరైనా మంత్రి వస్తే.. వారి ముందే బ్లాస్ట్ అయిపోతున్నారు. అక్కడ మీడియా ఉన్నా పట్టించుకోవడం లేదు. అనంతపురంలో… కోవిడ్ సేవల గురించి ప్రభుత్వం చాలా చెబుతూ వస్తోంది. అయితే..వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని.. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తేల్చేశారు. జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయడం లేదని… జిల్లాకు వచ్చిన వైద్య మంత్రి ఆళ్ల నాని ముందు మండిపడ్డారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో మేం వెళ్తే కానీ వైద్యులు కోవిడ్ వార్డుల్లోకి రావడం లేదు .. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరకముందే ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించడం లేదు .. డాక్టర్లకు కౌన్సెలింగ్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రోగులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటే.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రజల నుంచి ప్రజాప్రతినిధులకు వచ్చే ఒత్తిడి ఎలా ఉంటుందో… వెంకట్రామిరెడ్డి మాటల్లోనే తేలిపోతోంది. అనంతపురంలో… పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు కూడా రావడం లేదు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ అంతే పరిస్థితి ఉంది.
విశాఖలో విమ్స్ హాస్పిటల్‌కు మంత్రి అవంతి వెళ్తే… కరోనా బాధితుల బంధువులు వెంటపడినంత పని చేశారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ప్రచారం మీద పెట్టే దృష్టిలో పది శాతం అయినా… కోవిడ్ సెంటర్లలో సౌకర్యాలపై దృష్టి పెడితే బాగుంటుందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే సన్నాయి నొక్కులు నొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రభుత్వం పెద్దలు మాత్రం.. ” అరంగటలో బెడ్లు… ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే వైద్యం” ఇచ్చేలా ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు.