శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న అరకొర నీటిని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు తరలించేస్తోంది. ప్రాజెక్టులోకి పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉన్నా… తెలంగాణ మాత్రం అలాంటిదేమీ పట్టించుకోకుండా… నీటిని తరలిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ప్రాజెక్టులోకి వచ్చిన నీటిలో సగానికిపైగా అలాగే తెలంగాణ తరలించేసింది. దీనిపై ఏపీ సర్కార్.. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కృష్ణా బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. ఆ లేఖలతోనే సమయం గడిచిపోతోంది. కానీ.. తెలంగాణ మాత్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేదు. అయితే ఏపీ మాత్రం ఇప్పటికీ లేఖలు రాస్తూనే ఉంది. దీంతో.. వరద ఆగిపోయే సమయానికి కృష్ణాబోర్డు.. తెలంగాణ సర్కార్కు.. స్టాప్ ఆర్డర్ పంపింది. అయితే.. దాన్ని తెలంగాణ సర్కార్ పాటిస్తుందో లేదో చెప్పడం కష్టమే.
దూకుడుగా ఉండలేని ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం పూర్తి అనుకూలంగా మార్చుకుంది. శ్రీశైలం నీటిపై పూర్తి హక్కులు ఉన్నట్లుగా… ప్రాజెక్టులో నీటి మట్టం 800 అడుగులు ఉన్నప్పటికీ.. తరలించేస్తోంది. దీంతో రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వెళ్లిపోవడంతో.. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి లేకుండా పోయింది. గత ఏడాది ఆగస్టులో పెద్ద ఎత్తున శ్రీశైలంకు వరదలు వచ్చాయి. సీమకు నీరు విడుదల చేశారు. కానీ ఈ ఏడాది ప్రాజెక్టులో 80 టీఎంసీల నీరు కూడా లేవు. దీంతో రాయలసీమకు ఇప్పటి వరకు చుక్క నీరు విడుదల చేయలేకపోయారు.
తాము కూడా 800 అడుగుల నుంచి శ్రీశైలం నీరు తీసుకుంటామని.. ఏపీ సర్కార్. .. రాయలసీమ ఎత్తిపోతలకు సిద్ధమయింది. అయితే.. ఈ విషయంలో లౌక్యంగా వ్యవహరించకపోవడం వల్ల.. పదే పదే అడ్డంకులు ఎదురవుతున్నాయి. దూకుడుగా వెళ్లి.. టెండర్లను పిలవడంతో.. కృష్ణాబోర్డు ఆపేయాలని ఆదేశించింది. అయితే.. కృష్ణాబోర్డు ఆదేశాలను తెలంగాణ పట్టించుకోకుండా నీటిని విడుదల చేస్తున్నందున.. తాము కూడా టెండర్లను పిలవాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ సంగతేమో కానీ.. శ్రీశైలం నీటిని తెలంగాణ దిగువకు పంపడం ఆపకపోతే… రాయలసీమకు ఈ ఏడాది కరువు పలకరించడం ఖాయం.