దశాబ్దాలుగా వివాదంగా ఉండిపోయిన అయోధ్య రాములవారి ఆలయానికి బుధవారం శంకుస్థాపన జరగబోతోంది. ఓ వైపు కరోనా కలకలం రేపుతోంది. మరో వైపు.. నిరాడంబరంగా అయినా… కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడు రోజుల క్రితం.. యూపీ మంత్రి ఒకరు కరోనాతో చనిపోయారు. హోంమంత్రి అమిత్ షాకు పాజిటివ్‌గా తేలింది. మధ్యప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులకూ కరోనా సోకింది. యూపీ రామాలయ ప్రధాన పూజారికి కూడా కరోనా సోకింది. అయితే.. రామ మందిరం భూమిపూజ మాత్రం… నిర్వహించి తీరాలని.. యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
రామాలయం నిర్మాణం కోసం ప్రత్యేకంగా జూలై 18 న రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా విరాళాలతోనే నిర్మించాలని నిర్ణయించారు. అందుకే… శంకుస్థాపనకు బడా పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు. ప్రధానమంత్రి చేయబోతున్న భూమి పూజకు అవసరమైన సన్నాహాలు, ధార్మిక క్రతువులను జూన్ 10 నుండే జరుపుతున్నారు. 135 ఏళ్లుగా హిందూ సంస్థలు అక్కడ రామాలయం నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చింది బీజేపీ నేత అద్వానీనే. 1990లో రథయాత్ర చేశారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. బీజేపీ ప్రభుత్వం వస్తే, పార్లమెంటులో చట్టం చేసి రామ మందిరం నిర్మిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రతీ సారి చెప్పేది.
ఇప్పుడు.. ఎక్కడా వివాదం లేదు. అంతా హంగామానే ఉంది. రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది అయోధ్య రామాలయ నిర్మాణం అనేది కోట్లాది మంది హిందువుల స్వప్నం. అలాంటి గొప్ప… కార్యక్రమానికి వారంతా తరలి రావాలనుకుంటారు. రామాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఎవరూ రావొద్దని.. శ్రీరామ్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు దేశ ప్రజలను కోరుతోంది. ఆ రోజు సాయంత్రం అందరూ ఇళ్లలోనే ఉండి దివ్వెలు వెలిగించాలని సూచించింది.