కరోనా మీడియాపై, మరీ ముఖ్యంగా ప్రింటు మీడియాపై పెను ప్రభావాన్ని చూపించింది. దిన పత్రికల సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. ప్రింటింగు తగ్గించారు. పేజీలు తగ్గించారు. సిబ్బందిని తీసేశారు. వార పత్రికల సంగతి చెప్పాల్సిన పనిలేదు. అవి మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలీదు. రామోజీ రావు ఎంతో ఇష్టంగా ప్రారంభించిన `తెలుగు వెలుగు`, `బాలభారతం`లపై కూడా ఈ ప్రభావం పడింది. రామోజీ రావు కలల పుత్రికలు.. ఈ పత్రికలు. వీటి నిర్వహణని స్వయంగా చూసుకునేవారు. తెలుగు వెలుగుతో.. తెలుగు భాష ఖ్యాతిని ఈతరానికి అర్థమయ్యేలా చెప్పాలన్నది ఆయన ప్రయత్నం. 20 రూపాయల ధర ఉండే ఈ పత్రిక ప్రతినెలా ఒకటో తారీఖున పాఠకుల ముందుండేది. నాణ్యత విషయంలో రామోజీ రాజీ పడేవారు కాదు. నష్టం అని తెలిసినా.. మంచి క్వాలిటీతో పత్రికను తీసుకొచ్చేవారు. తొలినాళ్లలో లక్ష సర్క్యులేషన్ ఉండేది. క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. అయినా సరే.. రామోజీ తగ్గలేదు. ఎప్పుడూ లేనిది.. కథావిజయం పేరుతో కథల పోటీలు పెట్టి, భారీ ఎత్తున పారితోషికాలు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కరోనా వల్ల ఈ పత్రిక ప్రింటింగ్ ఆగిపోయింది. కేవలం ఆన్ లైన్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపైనా.. పత్రిక ప్రింటు రూపంలో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. బాలభారతం పరిస్థితీ ఇందే. విపుల, చతుర కూడా ఎప్పుడో ఆన్ లైన్ వెర్షన్‌కి షిఫ్ట్ అయిపోయారు. సితార కూడా అంతే. ఇప్పుడు తెలుగు వెలుగు, బాల భారతం వంతు వచ్చింది. ఈనాడు సర్క్యులేషన్ ఎప్పుడూ లేనంత ఘోరంగా పడిపోయింది. పల్లెపల్లెలోనూ ఈనాడు కనిపించేది. ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఈనాడు జాడే లేదు. తక్కువ సర్క్యులేషన్ ఉన్న ప్రాంతాల్ని గుర్తించి, అక్కడకు పత్రిక పంపడమే మానేశారు. అలా.. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గించడం కోసం. మొత్తానికి కరోనా వల్ల… ఈనాడు సంస్థలన్నీ తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి.