ప్రజా ఉద్యమాల కోసం జీవితం అంకితం చేసిన వంగపండు ప్రసాదరావు, సున్నం రాజయ్య కన్నుమూశారు. ఒకరు కరోనాతో చనిపోగా.. మరొకరు.. గుండెపోటుతో మృత్యువును ఆహ్వానించారు. ఇద్దరూ… ప్రజాచైతన్యం కోసం పోరాడిన వారే. ఒకరు కళలతో… ప్రజలను మేల్కొలిపే ప్రయత్నం చేయగా.. మరొకరు ప్రజా జీవితంలో ఉండి వారి కోసం నిరంతరం పాటుపడ్డారు. నేటి తరం.. ఇలా కూడా ఉండగలరా అని ఆశ్చర్యపోయే జీవన శైలితో వారి.. జీవితాంతం.. ఓ సిద్దాంతానికే కట్టుబడ్డారు.
వంగపండు ప్రసాదరావు అని పూర్తి పేరు చెబితే చాలా మందికి తెలియదు కానీ.. వంగపండు అంటే.. మాత్రం.. “ఏం పిల్లడో యెల్దమొస్తవా…” అంటూ ఉత్తరాంధ్ర జానపదాలు.. పెదాలపైకి రావడం సహజం. 77 ఏళ్ల వంగపండు తన జీవితాంతం…ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ప్రయత్నించారు. 1972 జననాట్య మండలిని స్థాపించారు. గద్దర్తో కలిసి పని చేశారు. వందలాది ఉత్తరాంధ్ర జానపదాలకు వంగపండు గజ్జెకట్టారు. విప్లవ కథాంశాలతో నిర్మించే సినిమాలకు కూడా పాటలు అందుకున్నారు. అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో ప్రారంభించి.. అనేక పాటలు శారు. ఆర్ నారాయణమూర్తితో ఆయనకు మిత్రుత్వం ఎక్కువ. అయితే కళను ఏనాడూ ఆయన డబ్బులతో వెల కట్టలేదు. చివరి రోజుల్లో పార్వతీపురంలోని తన ఇంట్లోనే కన్ను మూశారు.
ప్రజా జీవితంలో నిస్వార్థంగా బతికిన మరో నేత… సున్నం రాజయ్య. కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో ఉంటున్న ఆయనను వైద్య చికిత్స కోసం విజయవాడ తరలిస్తూండగా కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు వచ్చే జీతాన్ని కూడా.. పార్టీకే విరాళంగా ఇచ్చేవారు. ప్రజల కోసం.. నిస్వార్థంగా పని చేశారు. ఒక్క సారి ఎమ్మెల్యే అయితేనే… రూ. కోటి కారులో తిరిగే నేతలు ఉన్న కాలంలో.. ఆయన గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు.
ఇప్పుడు… డబ్బులు సంపాదించుకునేవారే గొప్పవారు . ప్రజల కోసం ఎవరైనా పని చేస్తారంటే.. వారిని వింతగా చూసే పరిస్థితులు వచ్చాయి. అందుకే…రాలిపోతున్న కమ్యూనిస్టుల గురించి చెప్పుకున్న ప్రతీ సారి… ప్రజలు ఏం కోల్పోతున్నారో గుర్తుకొస్తూ ఉంటుంది.